
మళ్లీ మోదీ వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
వరదయ్యపాళెం : నరేంద్ర మోదీని మరోసారి అధికారంలోకి రానిస్తే రాజ్యాంగం కనుమరుగై ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. వరదయ్యపాళెం మండల కేంద్రంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులకు ఐదు రోజులుగా రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు గురువారం ఉదయం దేశ , అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను కె.నారాయణ వివరించారు. ప్రపంచ దేశాల మధ్య భయంకర వాతావరణం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని అమెరికా ప్రయత్నం చేస్తోందన్నారు. అనంతరం పార్టీ కార్యక్రమం, బలమైన పార్టీ నిర్మాణం ఆవశ్యకత అనే అంశంపై జేవీఎస్ మూర్తి, భారత దేశ చరిత్ర సంస్కృతి, వక్రీకరణ అనే అంశంపై కొప్పర్తి వెంకటరమణ మూర్తి వివరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు , శిక్షణ తరగతుల ప్రిన్సిపల్‌గా పి.మురళి, కార్యదర్శిగా చిన్నిరాజ్ వ్యవహరించారు.