
పాఠశాల విలీనంపై నిరసన
● పేరెంట్స్– టీచర్స్ సమావేశంలోనే తల్లిదండ్రుల ఆవేదన
నాయుడుపేట టౌన్ : చంద్రబాబు నాయుడు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేస్తామని ఎంఈవో చెబితేనే తిరిగీ 1, 2 తరగతుల పిల్లలను పాఠశాలకు పంపుతున్నామని ఇప్పటి వరకు సమస్యను పట్టించుకోలేదని కాలనీ వాసులు పాఠశాల వద్ద గురువారం జరిగిన తల్లిదండ్రుల సమావేశం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు స్పందించకపోతే మళ్లీ 1, 2 తరగతుల విద్యార్థులను పాఠశాలకు పంపకుండా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇక్కడి పాఠశాలకు చెందిన 3,4,5 తరగతులకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులను తుమ్మూరు పాఠశాలలో విలీనం చేసినా అక్కడికి వెళ్లడం లేదు. పాఠశాలను చంద్రబాబు కాలనీలోనే యథావిధిగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాల విలీనం రద్దు చేయాలి
చంద్రబాబు నాయుడు కాలనీలో 3,4,5 తరగతులకు చదివే విద్యార్థులు సుమారు 30 మందికి పైగా విలీనం అయిన పాఠశాలకు వెళ్లడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. చంద్రబాబు కాలనీ నుంచి ప్రమాదకరంగా ఉండే రైలు పట్టాలు, జాతీయ రహదారి దాటుకుని తుమ్మూరు పాఠశాలకు ఎట్టి పరిస్ధితిలో విద్యార్థులను పంపలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టి చంద్రబాబు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేయాలి.
– నిర్మల, స్కూల్ కమిటీ చైర్‌పర్సన్, చంద్రబాబు నాయుడు కాలనీ