
ఐచర్‌ను ఢీకొన్న బైక్
● ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐచర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాష(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్‌తో పాటు ఐచర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో పడి బోల్తా పడగా, టమాటా బాక్స్‌లు , బైక్ మహబూబ్ బాషపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐచర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమలకు వెళ్లి వచ్చే సరికే ఇల్లు గుల్ల
5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ
చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఐచర్‌ను ఢీకొన్న బైక్