
ఉపాధ్యాయ బదిలీ నిబంధనలు సవరించాలి
● రేపు చిత్తూరు డీఈఓ కార్యాలయం ముట్టడి ● జయప్రదం చేయాలని పిలుపు ● ఒక్కటైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి చేసిన చట్టంలోని అసంబద్ధ నియమాలు, పాఠశాల పునర్వ్యవస్థకు సంబంధించిన వాటిని తక్షణమే సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాలరెడ్డి, జగన్నాథం, సాంబిరెడ్డి మాట్లాడుతూ 117జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పైగా 117జీఓ రద్దు పేరుతో గతంలో ఆరు రకాలుగా ఉన్న పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పాఠశాల స్థాయిలో ఉన్న భౌతిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడం, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా వచ్చాయని విమర్శించారు. దీంతో పాటుగా 3, 4, 5 తరగతులను మోడల్ స్కూల్ పేరుతో తరలించడం వల్ల అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోవడంతో పాటు చిన్న పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లడం భారంగా ఉంటుందన్నారు. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారని విమర్శించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న చేపట్టే చిత్తూరు డీఈఓ కార్యాలయ ముట్టడిని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు సురేష్, దండు రామచంద్రయ్య, బండి మధుసూదనరెడ్డి, వయ్యాల మధు, సుభాష్ చంద్రదాస్, వెంకటరమణ, రెడ్డిశేఖర్, మోహన్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.