
ఐడీఎస్‌తో స్విమ్స్ ఒప్పందం
తిరుపతి తుడా: విశాఖపట్నంకు చెందిన ఐడీఎస్ డేటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో స్విమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం స్విమ్స్ వీసీ, డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. హాస్పిటల్ పలు అంశాలపై సహాయ సహకారాలను అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్ తెలియజేశారు. ఎంఓయూ ద్వారా ఉచితంగా స్విమ్స్‌లో ల్యాబ్ సౌకర్యం, పరిశోధన, ఆవిష్కరణ, విస్తరణకు ఎంతో ఉపయోగకరమన్నారు. హెల్త్ కేర్ మెడికల్ సైన్స్ కోసం, స్విమ్స్ విద్యార్థులు, అధ్యాపకుల డేటాను సమీకరించడానికి, యూజీ, పీజీ పరిశోధన, ఆచరణాత్మక కోర్సుల్లో ల్యాబ్ సౌకర్యాలను వినియోగించడానికి పేషంట్ డేటాను నమోదు చేసే విషయంలో ఆ సంస్థ సహకారం కీలకంగా ఉంటుందన్నారు. అనంతరం ఐడీఎస్ సంస్థ ప్రతినిధులు, స్విమ్స్ అధికారులు ఒప్పందపు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఉపాధ్యక్షులు అరవింద్ ఓరుగంటి, ట్రాయ్ మాజీ కార్యదర్శి వి రఘునందన్, స్విమ్స్ నెట్‌వర్క్ ఇంజినీర్ ప్రణయ్ తేజ, స్విమ్స్ రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ చంద్ర, వైద్యులు పాల్గొన్నారు.