
యథేచ్ఛగా ఆక్రమణ
ప్రభుత్వ నిధులతో అక్రమ నిర్మాణాలు
● ఆక్రమదారులకు సహరిస్తున్న అధికారులు ● అధికారులపై విరుచుకుపడుతున్న స్థానికులు
●
నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు
ఎర్రావారిపాళెం మండలం, ఉస్తికాయాలపెంట గ్రామ శివార్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల విషయం మా దృష్టికి వచ్చింది. వీఆర్వో, ఆర్‌ఐ, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేయిస్తాం. వారు నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.
– పరమేశ్వరస్వామి, తహసీల్దార్, ఎర్రావారిపాళెం మండలం
మా దృష్టికి రాలేదు
ఎర్రావారిపాళెం మండలం, ఉస్తికారయాలపెంట గ్రామ శివార్లలోని ప్రభుత్వ భూమిలో గోకులం షెడ్ నిర్మించిన విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బిల్లులు చర్యలు తీసుకుంటాం. బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకుంటాం.
– మహేష్, ఏపీఓ
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చనేతలు చంద్రగిరి నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారు. అధికారులను అడ్డు పెట్టుకుని కబ్జాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఖాళీ జాగా కనబడితే చాలు ఆక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆపై వాటికి ప్రభుత్వ నిధులు మంజురు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటిదే ఎర్రావారిపాళెంమండలంలో వివాదాస్పందంగా మారింది.
అసలేం జరిగిందంటే
ఎర్రావారిపాళెం మండలం, ఉస్తికాయాలపెంట గ్రా మ క్రాస్‌లో గ్రామ రెవెన్యూ లెక్కదాఖల సర్వే నం.191లో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డులు కూడా పెట్టారు. ఈ భూమిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రయత్నించడంతో అప్పుడు టీడీపీ నాయకులు ఆడ్డుకున్నారు. ప్రభుత్వ భూమి, గుట్ట ప్రాంతంలో భవనాలు ఎలా నిర్మిస్తారని గగ్గోలు పెట్టారు. అక్కడ రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేసేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో రైతు భరోసా భవనానికి శాశ్వత భవనం లేకుండా పోయింది.
అధికార అండతో అక్రమ నిర్మాణాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదనే స్థలంలోనే అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. ప్రభుత్వం రైతుల కోసం గోకులం షెడ్లు మంజూరు చేయగా.. సదరు స్థలంలో దర్జాగా గోకులం షెడ్డును నిర్మించారు. గోకులం షెడ్ కాకుండా ఇతర నేతలు సైతం భూమిని ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మించిన గోకులం షెడ్‌కు ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇవ్వడం, ఆ షెడ్డుకు ఉపాధి నిధులు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై సాక్షత్తూ మండల మీట్లో ప్రజాప్రతినిధులను ప్రశ్నించినా అధికారులు చూస్తాం.. సర్వే చేస్తామంటూ కాలయాపన చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

యథేచ్ఛగా ఆక్రమణ