రేపటి నుంచి సాగరంలో వేట బంద్
● 61 రోజుల వరకు సముద్రంలో చేపలు పట్టడంపై నిషేధం ● గత ఆరు నెలలుగా కానరాని మత్స్యసంపద ● కష్టతరంగా మారిన గంగపుత్రుల జీవనం ● ఇప్పటికే రెండు పర్యాయాలు అందని ప్రభుత్వ ‘భరోసా’ ● సర్కారు తీరుపై ఆందోళనలో మత్స్యకారులు
అందని పరిహారం
ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే ఒక్కో మత్స్యకారుడికి వేట విరామ సమయంలో ఏటా రూ. 20 వేలు పరిహారం కింద ఇస్తామని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు వేట విరామం వచ్చింది. ఈ రెండు దఫాలు ఒక్క సారి కూడా పరిహారం చెల్లించలేదు. గత ఏడాది మత్స్యకారులకు అందాల్సిన వేట విరామ నగదు నేటికీ అందలేదు. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశంలో కూడా ఈ సారి వేట విరామానికి ముందుగానే మత్స్యకారులకు పరిహారం చెల్లిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అయినా ఇంత వరకు ఆ ఊసేలేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా ఆకలి కష్టాలు తప్పవంటూ మత్స్యకారులు వాపోతున్నారు. అసలే గత ఆరు నెలలుగా సముద్రంలో మత్స్య సంపద దొరక్క మత్స్యకారులు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ రెండు నెలలపాటు జీవనం ఎలా సాగించాలో తెలియక సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా వేట సక్రమంగా సాగక గంగపుత్రులు మెతుకు కరువై బతుకు భారమై విలవిలాడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందట్లేదని వాపోతున్నారు.
వాకాడు : సముద్రంలో వేట నిషేధ సమయం రానే వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి వేటకు లంగరు పడనుంది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు వేటకు విరామ సమయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా ఇదే షెడ్యూల్‌లో వేటను నిషేధించి తద్వారా మత్స్య సంపదను పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుంటాయి. సముద్ర జలాల్లో పడవలు, మెకనైజ్డ్, మోటారు బోట్లు ద్వారా చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ, కోస్టల్ గార్డ్స్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందించాల్సి ఉంటుంది. ఐతే రెండు దఫాలుగా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారం ఒక్క పైసా కూడా చెల్లించకపోవడం గమన్హాం.
తీరంలో లంగరు
జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో సముద్ర తీరం విస్తరించి ఉంది. వేట నిషేధం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ముందుగానే తమ బోట్లును తీరానికి తీసుకువచ్చి లంగరు వేస్తున్నారు. ఈ క్రమంలో నిఽషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు మర బోట్లు, పడవలతో కళ కళలాడిన సముద్ర తీరం బోసిబోతోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.35.5 కోట్లు
డాక్టర్ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 2019 నుంచి ఏటా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ముందుగానే రూ. 10 వేలు చొప్పున జీవన భృతిగా అందించారు. అలాగే డీజిల్‌పై సబ్సిడీ, ప్రమాద బీమా, 50 ఏళ్లకే పింఛన్ కింద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గంగపుత్రులకు రూ.35.5 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేశారు.
పస్తులుండాల్సిందే..
ఈ సారైనా వేట విరామం కాలంలో రావాల్సిన పరిహారం అందుతుందా.. లేదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా కూటమి ప్రభుత్వం పైసా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.40వేల చొప్పన మత్స్యకారులందరం నష్టపోయాం. ఇప్పుడైనా సాయం చేసారో లేదో తెలియని పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయూతనందించకుంటే పూట గడవక పస్తులుండాల్సిందే. – పోలయ్య,
మత్స్యకారుడు, కొండూరుపాళెం
రేపటి నుంచి సాగరంలో వేట బంద్
రేపటి నుంచి సాగరంలో వేట బంద్
రేపటి నుంచి సాగరంలో వేట బంద్


