
పుష్కరిణిలో తెప్పపై కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న పద్మావతీదేవి
తిరుచానూరు(చంద్రగిరి) : తిరుచానూరులో కొలువైన శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 3గంటలకు అమ్మవారిని ఆలయం నుంచి వేంచేపుగా పుష్కరిణి మధ్యలో ఉన్న నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు వైభవంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30గంటలకు అమ్మవారు తెప్పపై కొలువుదీరి పుష్కరిణిలో మూడు పర్యాయాలు విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. రాత్రి 7.30గంటలకు సర్వాంగ శోభితురాలైన శ్రీపద్మావతి అమ్మవారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్లు శేషగిరి, మధు, ఆర్జితం, వాహనం ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్, సుభాష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు గజవాహన సేవ :
తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం రాత్రి 8.30గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు