హైదరాబాద్‌: లోటస్‌ పాండ్‌ వద్ద వైఎస్‌ షర్మిల ఆమరణ దీక్ష.. కేసీఆర్‌ సర్కార్‌పై ఫైర్‌

YSRTP Chief YS Sharmila Continuous Fast At Lotus Pond - Sakshi

సాక్షి,  హైదరాబాద్:  వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్‌పాండ్‌లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్‌ను పోలీసుల దిగ్బంధించారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అక్కడ. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇంకోవైపు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అంటూ ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడానికి కారణాలేవీ లేవని,  ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నార’’ని ఆమె మండిపడ్డారు. 

మరోవైపు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. 

అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్‌ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల దీక్ష చేపట్టిన సందర్భంగా మండిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top