నేనిక ‘పాలేరు’ బిడ్డను..ఇక్కడ నుంచే పోటీచేస్తా!: షర్మిల

YS Sharmila Decided To Contest From Paleru Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు మట్టిలో ప్రజల రక్తం, శ్రమ అన్నీ ఉన్నాయి.. పాలేరు మట్టి సాక్షిగా మాటిస్తున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డ.. ఈరోజు నుంచి పాలేరు బిడ్డ.. పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలుపంచుకుంటుంది.. ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ప్రజలకు సంక్షేమ పాలన అందించే వరకు ఈ పోరాటం ఆపదు’.. అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం కరుణగిరి సమీపంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తన గుండెలో నిజాయితీ, సేవ చేయాలన్న తపన ఉన్నాయన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్సార్‌ సంక్షేమ పాలన వారి ఇంటికే చేరుస్తానని హామీ ఇచ్చారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో ఐదేళ్లలోనే 46 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించారని తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జలాలు పారించి 70 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందించారని, మంచినీటి శుద్ధి పథకంతో 108 గ్రామాలకు తాగునీరు అందించారని, ఐదేళ్లలోనే 20వేల ఇళ్ల నిర్మాణం చేయించారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలేరు నియోజకవర్గంలో వెయ్యి ఇళ్లయినా కట్టించారా..? అని షర్మిల ప్రశ్నించారు. 

ఎన్ని నిర్బంధాలెదురైనా ముందుకే.. 
షర్మిలమ్మ పార్టీ స్థాపించి 16 నెలలే అయినా.. అధికార పక్షం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్తోందని వైఎస్‌ విజయమ్మ చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీచార్జ్‌ చేశారని, రైతులను కాపాడు దొరా.. అంటే అరెస్ట్‌ చేశారని, ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో షర్మిలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమి పూజ.. షర్మిలమ్మ భవిష్యత్తుకు పునాది రాయని స్పష్టం చేశారు. ఈ కార్యాలయం పేద, బడుగు, బలహీన వర్గాలకు ద్వారం లాంటిదని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో షర్మిల పాదయాత్ర కో–ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గడిపల్లి కవిత, సాంస్కృతిక బృందం అధ్యక్షుడు ఏపూరి సోమన్న, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు పాల్గొన్నారు.

(చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top