కవ్వాల్‌లో వైల్డ్‌ డాగ్స్‌

Wild Dogs In Kawal Wildlife Sanctuary In Adilabad - Sakshi

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌): ప్రసిద్ధి చెందిన కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో అడవికుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలు, అధికారులు గుర్తించిన ఆనవాళ్లు ఆధారంగా దాదాపు 200 వరకు అడవి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క జన్నారం అటవీ డివిజన్‌లోనే సుమారుగా 90 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

పది నుంచి పన్నెండు కుక్కలు గుంపుగా ఉంటూ వన్యప్రాణులపై దాడికి దిగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి గ్రూపులు జన్నారం డి విజన్‌లో 8 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ రేసు కుక్కలు గుంపుగా సంచరిస్తూ అడవిలో నిత్యం అ లజడిని సృష్టిస్తున్నాయి.

ఈ కారణంగా పులి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వీటి సంఖ్య పెరగడంతోనే ఏడాదిగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని జన్నారం అటవీడివిజన్‌లో పులి అడుగు పెట్టడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

దట్టమైన అటవీప్రాంతం.. 
దట్టమైన అటవీ ప్రాంతం, రకరకాల వన్యప్రాణులు, జలపాతాలు కలబోసిన కవ్వాల్‌ అడవులు పులులకు అనువుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో కవ్వాల్‌ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్‌లోకి ఉమ్మడి అదిలాబా ద్‌ జిల్లా అడవులు వస్తాయి. 892.23 చదరపు కిలోమీటర్ల కోర్‌ ఏరియా, 123.12 చదరపు కిలోమీటర్ల బఫర్‌ ఏరియాగా గుర్తించారు.

మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్, టైగర్‌ రిజర్వ్, చతీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌జోన్‌లో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయని అధికారులు భావించారు.  

రాక మరిచిన బెబ్బులి.. 
రేసు కుక్కలుగా గుంపుగా తిరుగుతూ వేటాడుతాయి. వన్యప్రాణులను భయపెట్టే బెబ్బులి సైతం కుక్కల అలజడితో ఇటువైపు తిరిగి చూడటం లేదు. సంఖ్య బలంతో పులిని కూడా అవి భయపెడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో బఫర్‌ ఏరియా అయిన కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఆరుకుపైగా పెద్దపులులు సంచరిస్తుండగా.. వేమనపల్లి, కోటపల్లి ప్రాంతాల్లో కూడా పులి సంచారం ఉంది.

కానీ అన్ని విధాలుగా అనుకూలంగా జన్నారం అటవీడివిజన్‌లో మాత్రం సంవత్సర కాలంగా అధికారులు పులి కదలికలను గుర్తించలేదు. పులులకు అనువైన ప్రాంతంగా, ఇక్కడ పదికి పైగా పులులకు సరిపడా వన్యప్రాణులు, ఆవాసాలు ఉన్నట్లు అంచనా వేశారు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌ జోన్‌ల నుంచి కవ్వాల్‌ టైగర్‌ జోన్‌కు వచ్చే కారిడర్‌ నిత్యం అలజడితో ఉండటంతో పులి రాకపోకలు తగ్గిపోయాయి.

బఫర్‌ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి.. కోర్‌ ఏరియాలోకి అడుగు పెట్టకపోవడానికి అనేక కారణాలున్నాయి. రెండేళ్లపాటు రాకపోకలు సాగించిన పులి సంవత్సరం కాలంగా ఇక్కడ కనిపించడం లేదు. కారిడర్‌ వెంబడి హైవే రోడ్డు పనులు జరుగడం, మధ్యలో రైల్వేలైన్‌ ఉండటం కూడా ఓ కారణమని అధికారులు పేర్కొంటున్నారు.  

అలజడితోనే ఇబ్బంది 
కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలో జన్నారం అటవీ డివిజన్‌ 12 శాతం మా త్రమే ఉంది. ఇక్కడ పులి నివాసానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. డివిజన్‌ పరిధిలో ఇటీవల అడవి కుక్కల సంఖ్య పెరిగింది. పులి రాకపోవడానికి అవి కూడా కారణం కావచ్చు. కారిడర్‌లో నిత్యం అలజ డి ఉండటం, పుశువులు, మనుషుల సంచా రం కారణంగా రాకపోకలు తగ్గిపోయాయి. 

– సిరిపురం మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం  

చదవండి: కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top