అంతిమ సంస్కారాలు ఇలాగేనా?

Dogs Eat COVID 19 Deceased Bodies in Adilabad - Sakshi

కరోనా మృతుల శవాలను పీక్కుతింటున్న కుక్కలు 

పూర్తిగా దహనం చేయని వైనం 

పట్టించుకోని అధికారులు 

ఆదిలాబాద్‌టౌన్‌: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఎంతదూరంలో ఉన్నా సరే.. చనిపోయారనే సమాచారం అందగానే చివరి మజిలీకి హాజరై తుది వీడ్కోలుతో సాగనంపుతారు. కరోనా నేపథ్యంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ నిర్వహించాల్సిన అధికారులు మానవీయకోణంలో ఆలోచించకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను దహనం చేస్తున్నప్పటికీ అవిపూర్తిగా కాలకపోవడంతో గ్రామసింహాలకు ఆహారంగా మారుతున్నాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. 

ఇదేనా అంతిమ సంస్కారం?
జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా కాటుకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఒకరు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందగా అంత్యక్రియలు అక్కడే జరిపారు. మరో నలుగురు ఇటీవల మృతి చెందగా వారి అంతిమ సంస్కారాలు ప్రభుత్వమే నిర్వహించింది. మృతదేహాలను మావల ఊరి బయట పొన్నారి శివారులోని మోరం క్వారీల ప్రాంతంలో దహనం చేస్తున్నారు.

ఈ దహన కార్యక్రమాలు మున్సిపల్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. శవాన్ని తగలబెట్టిన తర్వాత పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్లాలి. కానీ శవాన్ని తగలబెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సగం కాలిన శవాలను కుక్కలు లాక్కెళ్లి పీక్కుతింటున్నాయి. అటువైపు పంటపొలాలకు వెళ్తున్న వారు ఈ దృశ్యాలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి బంధువులు కూడా కన్నీరుపెట్టుకుంటున్నారు. కనీసం శవాలను ఇవ్వకపోయినా.. దహన సంస్కారాలు చేసేది ఇలాగేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మృతుల దహన సంస్కారాలపై పూర్తి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

నా దృష్టికి రాలేదు 
కరోనాతో మృతి చెందిన శవాలకు మావల ఊరి చివర దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఇక నుంచి కరోనా మృతులు చనిపోతే శవం కాలిపోయేంత వరకు సిబ్బందిని అక్కడే ఉంచుతాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– సీవీఎన్‌ రాజు, మున్సిపల్‌ సహాయ కమిషనర్‌

బాధ్యత మున్సిపల్‌దే 
కరోనా మృతదేహాలను ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో దహన సంస్కారాలు నిర్వహించే చోటుకు తీసుకెళ్తాం. అక్కడ దహన సంస్కారాలు మున్సిపల్‌ అధికారులు చూస్తారు. సగం కాలిన శవాలను కుక్కలు తినడమనే విషయం నా దృష్టికి రాలేదు. ఇలా జరుగకుండా చూస్తాం.– నరేందర్‌ రాథోడ్,జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top