నర్సాపూర్‌కు చెందిన రైతు దంపతులు కరోళ్ల కనకయ్య, మంగవ్వ.. 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని 15 రోజుల క్రితం సిద్దిపేటలోని మార్కెట్ యార్డుకు తెచ్చారు. తేమ శాతం, జాలి పట్టడం అయినప్పటికీ గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. దీంతో యార్డులోనే ధాన్యం కుప్పలు పోసి, ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి సగం ధాన్యం తడిసిపోయింది. కొంతమేర ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇన్నాళ్ల కష్టం నీళ్లపాలైందని వారు కన్నీటిపర్యంతమయ్యారు.
రైతులను నిండా ముంచిన అకాల వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
యార్డులు, ప్యాక్స్ కేంద్రాల్లోని మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి
కొన్ని కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాసిన అన్నదాతలు
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, యాదాద్రి, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లో తీవ్ర నష్టం
స్పందించిన ప్రభుత్వం.. కొనుగోళ్ల వేగం పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి
తడిసిన ధాన్యాన్నీ సేకరిస్తాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి ప్రకృతి మరో సారి కన్నెర్రజేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతుల కష్టాన్ని నీటిలో కలిపేసింది. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ఆశగా తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న వర్షానికి తడిసిముద్దవగా.. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. తమ పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు నిస్సహాయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు మళ్లీ వాటిని ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులు రాత్రివేళ కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యం నిల్వలు తడవకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంట్రాక్ట్ లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయి. వర్షం మొదలవగానే రైతులు పరుగులు తీస్తూ బస్తాలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాశారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
వారాల తరబడి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లలోనే నిల్వ ఉంచుతుండటంతో... తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి తలెత్తింది. కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచుల కొరత, లారీల లేమి కారణంగానే ఈ నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా అకాల వర్షంతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షానికి తడిసిన వడ్లను పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ...
⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. ‘వారం రోజులుగా లారీలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికీ రాలేదు. ఒక్క వానతో మా కష్టం అంతా పోయింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, సూరారం కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజుల తరబడి లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్, రామాయంపేట, చేగుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. నిజాంపేట మండలంలో కల్లాలు లేక రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోసుకున్నారు. వర్షం రావడంతో రోడ్లపై ఉన్న వడ్ల కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి.
⇒ కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సదాశివనగర్ మండలం మల్లుపేట, ఎల్లారెడ్డి పరిసరాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచిపోయింది.
⇒ జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డులో వర్షం కారణంగా ధాన్యం, మక్కలు తడిశాయి.
⇒ పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్ల కుప్పలు, బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోవడంతో వర్షపు నీరు ధాన్యంలోకి చేరింది.
⇒ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాత్రివేళ రైతులు ప్లాస్టిక్ షీట్లు కప్పి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
⇒ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పంటలను కాపాడేందుకు వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మృతి చెందిన ఘటన అకాల వర్షాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
⇒ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, హమాలీలు, లారీలు లేకపోవడం వల్లే ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అచ్చంపేట మార్కెట్‌కు వడ్లు తీసుకొచ్చి చాలా రోజులైనా కాంటా వేయలేదు. కుప్పలుగా పోసిన ధాన్యం మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసింది. నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కనీసం తడిసిన వడ్లను వెంటనే కొనాలి.
–రషీదా, మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ జిల్లా
చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిపై ఉత్తమ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేందుకు ఇసుక రవాణా లారీలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇప్పటికే రూ.10,097 కోట్ల చెల్లింపులు జరిగాయని, దీనివల్ల 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు కాగా, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.


