
నగరంలో ప్రతిపాదనలకే పరిమితమైన వైనం..
రూ.15 వేల కోట్లు అవసరం ఉన్నట్లు అంచనా
నిధుల లేమితో వెనుకడుగు.. ఇప్పటికీ ప్రారంభం కాని పనులు
తరచూ తెగిపడుతున్న ఓవర్‌హెడ్ లైన్లు..
మృత్యువాతపడుతున్న సిటిజన్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రధాన రహదారులు, వీధుల్లో వేలాడుతున్న ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు సెక్షన్ల వారీగా ఫీడర్ల వివరాలను సేకరించింది.
ఒక్కో సెక్షన్‌కు రూ.వంద కోట్ల చొప్పున గ్రేటర్ వ్యాప్తంగా ఇందుకు రూ.15 వేల కోట్లకుపైగా అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మెట్రోజోన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో డిస్ట్రిబ్యూషన్ లైన్లు మినహా 33/11 కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇక మేడ్చల్ (హబ్సిగూడ, మేడ్చల్ సర్కిల్), రంగారెడ్డి (సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్) జోన్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓహెచ్ (ఓవర్ హెడ్ లైన్లే) కన్పిస్తున్నాయి.
ఈదురు గాలులతో కూడిన వర్షానికి తరచూ తెగిపడుతూ..అటుగా వచ్చి వెళ్లేవారిపై పడి అమాయక ప్రజల మృత్యువాతకు కారణమవుతున్నాయి. ప్రమాదాలను నియంత్రించడంతో పాటు వేలాడే కరెంట్ తీగలు కని్పంచని నగరంగా తీర్చిదిద్దాలని భావించి..ఆ మేరకు నగరమంతా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఉపముఖ్య మంత్రి భట్టి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం బెంగళూరులో పర్యటించి, ఆ మేరకు భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించింది. సెక్షన్ల వారీగా ప్రతి పాదనలు సిద్ధం చేయాల్పిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రాజెక్ట్ విభాగం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.
ప్రతిపాదన దశలోనే ఆ పనులు..
గ్రేటర్‌లో ప్రస్తుతం 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజు గరిష్ట విద్యుత్ డిమాండ్ 65 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలకే కాకుండా అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి.
ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగులను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్ హెడ్ లైన్‌కు ఆనుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఓవర్‌హెడ్‌లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చొచ్చని డిస్కం భావించినప్పటికీ..ఇందుకు సంస్థ వద్ద సరిపడు నిధులు లేకపోవడం పనులకు విఘాతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీం ప్రకటించి నిధులు కేటాయిస్తే మినహా..ఇప్పట్లో ఈ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు.