నకిలీ విత్తనం.. మాఫియా పెత్తనం!

Two Held For Selling Fake Cotton Seeds In Telangana - Sakshi

రాష్ట్రంలో పలుచోట్ల నిషేధిత బీటీ–3 పత్తి సాగు 

పట్టుబడిన కల్తీ విత్తనాల్లో వెలుగు చూసిన వైనం 

ల్యాబ్‌లో నిర్ధారణ.. రంగంలోకి వ్యవసాయశాఖ ఇంటెలిజెన్స్‌ 

సీడ్‌ ఆర్గనైజర్లు అప్రమత్తమై సీడ్‌ పత్తి సాగుదారులకు అప్పు ఇవ్వకుండా దాటవే

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పత్తివిత్తన మాఫియా నకిలీలలు’అన్నీఇన్నీకావు. అక్రమార్కుల మాయాజాలంలో అ మాయక రైతులు చిక్కుకుంటున్నారు. తాము కొని సాగు చేసినవి నకిలీ విత్తనాలనే విషయం కూడా రైతులకు తెలియకపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలను పసిగట్టే పరిస్థితిలేక చాలామంది నష్టపోతున్నారు. ఇదీ నడిగడ్డ కేంద్రంగా వేళ్లూనుకున్న విత్తన మాఫియా మాయాజాలం. అక్రమార్కు ల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ–3 సాగు కొనసాగుతున్నట్లు తేలింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో పోలీసుల దాడుల్లో వేలాది క్వింటాళ్లలో నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందే జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పలు మండలాలతోపాటు ఇతర జిల్లాల రైతులకు ఇవి చేరాయి. 

ఇలా బట్టబయలు.. 
ఈ ఏడాది జూలైలో హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు డీసీఎంలో నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు టన్నుల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అవి బీటీ–3 విత్త నాలని తేలింది. ఈ క్రమంలో గద్వాల, మల్దకల్, ధరూరు, అయిజ మండలాల్లో పట్టుబడిన నకిలీ విత్తనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపారు. వీటిలో బీటీ–3 విత్తనాలున్నాయని నిర్ధారణ అయింది. 

రంగంలోకి వ్యవసాయ శాఖ ఇంటెలిజెన్స్‌.. 
గద్వాల జిల్లాలో నిషేధిత బీటీ–3 విత్తనాలు వెలుగుచూడటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగి బీటీ–3 పంట పండిస్తున్న రైతులకు విత్తనాలు ఇచ్చిన సీడ్‌ ఆర్గనైజర్లు, సబ్‌ ఆర్గనైజర్లు ఎవరు.. ఏ కంపెనీ విత్తన ప్యాకెట్లు.. బ్రాండెడ్‌ కంపెనీలా.. సీడ్‌ ఆర్గనైజర్ల సొంత బ్రాండెడ్‌ కంపెనీలా.. ఎప్పటి నుంచి నిషేధిత బీటీ–3 పంట సాగవుతోంది.. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు.. అనే కోణాల్లో పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలిసింది.  

రైతులకు తెలియకుండానే.. 
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో పలువురు రైతుల నుంచి బీటీ–3 విత్తనాలను తక్కువ ధరకు సీడ్‌ ఆర్గనైజర్లు సేకరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా గద్వాల, ధరూరు, మల్దకల్‌ మండలాలకు.. కర్ణాటక కేంద్రంగా అయిజ మండలానికి తరలించి రైతులకు తెలియకుండానే బీటీ–3 విత్తనాలను వారికి కట్టబెట్టినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. సీడ్‌ ఆర్గనైజర్లు ఏడాది కిత్రం ధరూర్, అయిజ మండలాల్లో పలువురు రైతులకు బీటీ–3 ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చి సాగు చేయించారని.. మళ్లీ వాటిని సేకరించి ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన సొంత బ్రాండ్‌ ప్యాకెట్లలో వేసి పలుచోట్ల రైతులకు విక్రయించారని విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీడ్‌ ఆర్గనైజర్లతో పాటు కంపెనీల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం అధికారులు విచారణ చేస్తున్నారు. 

అందుకే పెట్టుబడి ఇవ్వడం లేదా? 
రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ వర్గాలు విచారణ చేపట్టినట్లు గ్రహించిన సీడ్‌ ఆర్గనైజర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీడ్‌ పత్తి మొక్కలు ఏపుగా పెరగగా.. క్రాసింగ్‌ దశలో కూలీలు, ఇతరత్రా ఖర్చు అధికం. దీంతో రైతులు పెట్టుబడి కోసం సీడ్‌ ఆర్గనైజర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బీటీ–3 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందనే భయంతో సీడ్‌ఆర్గనైజర్లు రైతులకు అప్పు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికైనా సాగు నిలిపివేసి.. పంట తొలగించాలని పరోక్షంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఆర్గనైజర్లు పెట్టుబడికి డబ్బులు ఇవ్వకపోవడంతో మల్దకల్, అయిజ మండలాల్లో పలువురు రైతులు పంటలు తొలగించారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్గనైజర్లు మాత్రం ‘కంపెనీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.. మేం చేతి నుంచి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సొంతంగా పెట్టుబడి పెడితేనే సీడ్‌ పత్తి సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం’అని చెబుతున్నారు. 

కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిర్వహించిన దాడుల్లో మొత్తం 162 క్వింటాళ్ల ఫెయిలైన విత్తనాలు పట్టుబడ్డాయి. అనుమానంతో జిల్లా నుంచి మొత్తం ఆరు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. అవి నిషేధిత బీటీ–3 విత్తనాలుగా నిర్ధారణ అయ్యాయి. నిందితులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన విత్తనాలతోపాటు ల్యాబ్‌ రిపోర్ట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తాం. 
– గోవింద్‌ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి, జోగుళాంబ గద్వాల  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top