ఒకరు ఇద్దరు కాదు.. మొత్తం కుటుంబాలే ఆగమాగం

Tragic Situations Due To Pandemic - Sakshi

విషాదం నింపుతున్న మహమ్మారి వైరస్‌

ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గుర్ని బలితీసుకుంటున్న మహమ్మారి

కరోనా సోకడంతో అందరూ ఆస్పత్రుల పాలవుతున్న వైనం

అవగాహన లోపం, అలక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందంటున్న వైద్య నిపుణులు

జగిత్యాల పట్టణం గణేష్‌ నగర్‌ కాలనీకి చెందిన దొంతుల రామచంద్రం కుటుం బాన్ని కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేసింది. కుటుంబం మొత్తానికీ సోకిన వైరస్‌.. ఇంట్లోని ముగ్గురు మగవారిని బలి తీసుకుంది. ఈనెల 14న రామచంద్రన్‌ పెద్ద కుమారుడు కోవిడ్‌–19తో మరణించాడు. తర్వాత రెండ్రోజులకు రామచంద్రం మరణించగా... తర్వాత మూడో రోజు చిన్న కుమారుడు సుమన్‌ మృత్యువాత పడ్డాడు. రామచంద్రం భార్య, కోడళ్లు ప్రస్తుతం నగరంలోని ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనితో చనిపోయిన ముగ్గురికీ స్థానిక కౌన్సిలర్‌ తిరుమలయ్య అంత్యక్రియలు చేయించాడు.

కామారెడ్డి జిల్లా బిర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. ఉమ్మడి కుటుంబంలో అందరికీ వైరస్‌ సంక్రమించగా ఇప్పటివరకు ఇద్దర్ని బలి తీసుకుంది. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన గంగామణి ఈనెల 18వ తేదీన మరణించగా... మరుసటి రోజు ఆమె కుమారుడు హనుమంతు మృత్యువాత పడ్డాడు. హనుమంతు భార్య మీనా, తమ్ముడు సురేశ్, బావ క్యాతప్ప, బావమరిది అనిల్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: సెకండ్‌ వేవ్‌ కరోనా వ్యాపించే వేగం ఎక్కువగా ఉండటం, ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. కుటుంబాల్లో చిన్నాపెద్దా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఒకరికొకరు బాగోగులు చూసుకునేవారే లేకుండా పోతున్నారు. అందరికీ వైరస్‌ సోకిందనే భయాందోళనతో ఆరోగ్యం మరింతగా దెబ్బతీసుకుంటున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మరింతగా కుంగిపోతున్నారు. ఈ ఆవేదన, ఆందోళనతో మరికొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కరోనాతో చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అవగాహన లోపం, లక్షణాలు తక్కువగా ఉండడంతో ఏమీ కాదనే అతి విశ్వాసం, జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం.. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు వెళ్తుండటంతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో కుటుంబంలో ఒకరు వైరస్‌ బారిన పడితే.. ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే మిగతావారందరికీ వైరస్‌ సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరితర్వాత మరొకరు వైరస్‌ బారిన పడడంతో ఇంట్లో దైర్యం చెప్పేవారు సైతం కుంగుబాటుకు గురవుతున్నారు. ఆహారం, ఇతర అవసరాలు తీర్చేవారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఏ ఒక్కరో చేస్తున్న పొరపాటు కుటుంబం మొత్తానికీ శాపంలా మారుతోంది. కనీస జాగ్రత్తలు పాటించకుంటే మరణాలు పెరిగే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు.  
విషాద ఘటనలు మరికొన్ని

  • జగిత్యాల మండలం చల్గల్‌కు చెందిన పందిరి భీమలింగం కరోనా వైరస్‌ ప్రభావంతో మరణించారు. ఆయన మరణించిన మూడు రోజులకే భార్య లక్ష్మి మృత్యువాత పడింది. 
  • రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన దంపతులు అశోక్, శ్రీలత కరోనా బారిన పడ్డారు. వారిపై వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపడంతో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తాయి. దీంతో అశోక్‌ మరణించగా, ఆ తర్వాత గంట వ్యవధిలోనే శ్రీలత మరణించింది.
  • నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం రాంటెక్‌ గ్రామంలో తల్లీబిడ్డలు లక్ష్మీబాయి, భారతీబాయి కరోనా బారిన పడ్డారు. దీంతో వారి ఇంటివైపు ఇరుగుపొరుగూ ఎవరూ వెళ్లలేదు. దాదాపు పదిరోజులు తర్వాత వారు ఇంట్లోనే మృత్యువాత పడ్డారు. వారం తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వచ్చిన పోలీసులకు తల్లీబిడ్డల మృతదేహాలు కుళ్లిపోయి కన్పించాయి. లక్ష్మీబాయికి ఉన్న కుమారుడు మతిస్థిమితం లేక గ్రామంలో సంచరిస్తుంటాడు. 
  • ఆర్మూర్‌ టౌన్‌కు చెందిన ఎంఐఎం నేత సయ్యద్‌ ఖాసీం అలీ గోరేమియా కోవిడ్‌తో మరణించారు. అతని భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించిన రోజు సాయంత్రమే భార్య ఉన్నీసా కూడా కరోనా ప్రభావంతో మరణించడంతో విషాదం నెలకొంది.
  • జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇంట్లో ఐదు నెలల బాబుకు కూడా కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మౌనిక నిర్ధారించారు.
  • సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం వాసర్న గ్రామానికి చెందిన సుభాష్‌రావు రెండ్రోజుల క్రితం కరోనాతో మరణించారు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కును కోల్పోవడం, ఇద్దరు కుమారుల్లో ఒకరు మానసిక వికలాంగుడు కావడంతో సుభాష్‌రావు భార్య గీనాబాయి కన్నీరుమున్నీరవుతోంది.

ఆందోళన వద్దు.. అవగాహనే మందు
కోవిడ్‌–19కు ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి తాలూకు లక్షణాలకు అనుగుణంగా స్పందించి చికిత్స పొందితే ఉపశమనం కలుగుతుంది. హోం ఐసోలేషన్‌ మొదలు కార్పొరేట్‌ ఆస్పత్రి వరకు ఇలాంటి చికిత్సనే అనుసరిస్తున్నారు. అత్యవసర కిట్లు, ఇతర మౌలిక వసతులు ఆస్పత్రుల్లో ఉండడంతో కొంత ధైర్యం కలుగుతుంది. ఆందోళన కారణంగానే ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఆ మేరకు మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను జయించవచ్చు.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

మాస్కు కీలకపాత్ర
కోవిడ్‌–19 నుంచి తప్పించుకోవడంలో మాస్కు కీలకపాత్ర పోషిస్తుంది. మాస్కును సరైన విధంగా ధరించడం, జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. లక్షణాలు కన్పించగానే, వైరస్‌ బారిన పడినప్పటికీ ఇంట్లో కూడా మాస్కు ధరిస్తే ఇతరులకు వైరస్‌ సోకనీయకుండా జాగ్రత్త పడొచ్చు. 
– డాక్టర్‌ విజయనరసింహారెడ్డి,  జనరల్‌ మెడిసిన్, కడప రిమ్స్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top