వైరల్‌: రాత్రి బైక్‌ సీజ్‌‌పై వివరణ ఇచ్చిన ఏసీపీ

Traffic ACP Srinivas Gave Clarity On Night Bike Seized In Hyderabad - Sakshi

సాక్షి, శామీర్‌పేట్‌: ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి సమయంలో బైక్‌ సీజ్‌ చేయడంతో అర్ధరాత్రి వరకు మైనర్‌ బాలిక, ఇద్దరు యువకులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నగరంలోని బోరబండకు చెందిన రిషిక కీసరలోని గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేయడంతో బుధవారం సాయంత్రం రిషికను ఇంటికి తీసుకొచ్చేందుకు బాలిక మామ కిరణ్‌ అతడి స్నేహితుడితో కలిసి బైక్‌పై వచ్చాడు.

ఆమెను తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్, బైక్‌ నడిపే వ్యక్తికి లైసెన్స్‌ లేకపోవడంతో బైక్‌ను సీజ్‌ చేశారు. డబ్బులు లేవని వేడుకున్నా పోలీసులు స్పందించకపోవడంతో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. లిఫ్ట్‌ అడుక్కుని అవస్థలు పడుతూ తెల్లవారుజామున ఇంటికి చేరినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. 

ఇంటికి వెళ్లేందుకు సౌకర్యం కల్పించాం.. 
ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం రాత్రి శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. త్రిబుల్‌ రైడింగ్, లైసెన్స్‌ లేని కారణంగా కేసు నమోదు చేశామని, ఆ సమయంలో బైక్‌పై ప్రయాణిస్తున్న బాలిక అతడి మామకు ఇంటికి వెళ్లేందుకు సౌకర్యం కల్పించామన్నారు. నగరంలోని వై జంక్షన్‌ వరకు ఓ కంపెనీ బస్సులో పంపించామని, అక్కడి నుంచి ఇంటికి చేరుకునేందుకు దారి ఖర్చులకు రూ.100 ఇచ్చినట్లు వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top