ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సన్మానిస్తున్న సినీ కార్మిక సంఘాల నేతలు. చిత్రంలో దిల్ రాజు తదితరులు
పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో ఆ మేరకు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు ఇవ్వాలి
అలా ఇస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తాం
వెల్ఫేర్ ఫండ్ పెట్టండి.. ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లిస్తాం
సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల
హాలీవుడ్ సినిమాలకు కూడా హైదరాబాద్ వేదికవ్వాలి
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమకు చోటు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన.. సీఎంకు సినీ కార్మికుల సన్మానం
సాక్షి, హైదరాబాద్: సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచాలంటే.. ఇకపై పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికుల వెల్ఫేర్‌ఫండ్ ఏర్పాటు చేసి, ఆ మొత్తాన్ని ఫండ్‌కు జమచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలా ఇస్తేనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టంచేశారు. ఆ మేరకు ఒక జీవో జారీ చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం సినీకార్మిక సంఘాలు యూసుఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సినీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి సినీ కార్మిక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సంఘాలకు సూచించారు.
ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘చాలామంది సినిమా పెద్దలు టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు వస్తున్నారు. ధర పెంచితే నిర్మాత, హీరోలకు ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు మాత్రం దాని ఫలాలు దక్కడం లేదు. మీ శ్రమతో సంపాదించిన ప్రతి రూపాయిలో మీకు భాగస్వామ్యం ఉండాలి. టికెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇస్తుంది.
కృష్ణానగర్‌లో మూడునాలుగు ఎకరాల స్థలం చూడండి. సినీ కార్మికుల పిల్లల చదవుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మిస్తాం. టిఫిన్, లంచ్, ఉన్నత విద్య అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అసోసియేషన్‌కు భవనం లేదని నా దృష్టికి వచ్చింది. కొంత స్థలం కేటాయించి, నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఫైటర్స్, సినీ కార్మికుల ప్రాక్టీస్ కోసం స్థలం కావాలన్నారు. ఫ్యూచ ర్‌సిటీలో మీకు కావా ల్సిన ఏర్పాట్లు చేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు.
హాలీవుడ్‌కు కూడా హైదరాబాద్ వేదికవ్వాలి
హైదరాబాద్ నగరం హాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు వేదిక కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ఒకనాడు తెలుగు సినీ పరిశ్రమను మద్రాసీ అని పిలిచేవారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, అగ్ర నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు వంటి మహానుభావులు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడాన్ని ప్రోత్సహించారు. సినీ కళాకారులు, కార్మికులు ఎంతో కష్టపడతారు. నగదు బహుమతుల కంటే కొట్టే చప్పట్లు, సన్మానంలో కప్పిన శాలువాలతోనే సంతోషపడతారు.
కవులు, కళాకారులను సన్మానించే కార్యక్రమం పదేళ్లు ఆగిపోయింది. ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో గద్దర్ ఫిలిం అవార్డుల రూపంలో అందిస్తున్నాం. నంది అవార్డులను గెలవడమే గొప్ప అనుకున్నాం. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయం వెనుక డైరెక్టర్లు, నటులే కాదు.. కార్మికుల శ్రమ కూడా ఉంది. తెలుగు సినిమాల షూటింగ్ ఇతర దేశాల్లో జరగడం కాదు.. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలన్నది నా ఆలోచన. మీరంతా అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే బాధ్యత మాది’అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ పెడతామని చెప్పారు.
నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోను..
సినీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలి పారు. ‘మహాభారతంలో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ప్రాణత్యాగం చేశాడు. మీకు అండగా నేను నిలబడతా. సమస్యలు పరిష్కరిస్తా. నిర్ణయం తీసుకోనంత వరకే నేను ఆలోచిస్తాను. తీసుకున్నా క ఆలోచన చేయను. నవంబర్ చివర లో మళ్లీ మీ సంఘాల నాయకులను కలుస్తా. ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన ప్ర ణాళికతో ముందుకెళతాం. నిర్మాతలతో మీకు ప్రతిష్టంభన వచ్చినపుడు.. మీరు రాణించాలంటే కార్మికులను కుటుంబ సభ్యుల్లా చూసుకో వాలని దర్శక, నిర్మాతలకు చెప్పాను. మీ సమ స్యలను తెలుసుకోవడానికి నేనే కృష్ణానగర్‌కు వస్తా. కార్మికులకు ఇళ్ల గురించి అడిగారు.. ఎంతవరకు సాయం చేయగలనో అంచనా వేసుకున్నాక 24 క్రాఫ్ట్స్ నాయకులను పిలిచి మాట్లాడుతా’ అని సీఎం హామీ ఇచ్చారు.
శృంగేరి విధుశేఖర స్వామిని కలిసిన సీఎం
⇒ శంకరమఠంలో మర్యాదపూర్వకంగా భేటీ
⇒ రేవంత్‌కు ఆశీస్సులు అందించిన స్వామీజీ
నల్లకుంట: శృంగేరి శారదా పీఠం దక్షిణామ్నాయ జగద్గురువు విధుశేఖర భారతీ స్వామిని «ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ నల్ల కుంటలోని శంకరమఠంలో మర్యాదపూర్వకంగా క లిశారు. స్వామీజీకి సీఎం పూలమాలను సమర్పించగా, సీఎం మెడలో స్వామీజీ రుద్రాక్ష మాల వేసి జగద్గురువు చిత్రపటం అందజేసి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శంకరమఠం ధర్మా ధికా రి చింతలపాటి శ్రీనివాసమూర్తి, పండితులు వేద మంత్రాలతో సీఎంకు స్వాగతం పలికారు. ముందుగా మఠం ప్రాంగణంలో గల శక్తి గణపతి, చంద్ర మౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యులు, శారదాంబ ఆలయాల్లో సీఎం ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
‘ధర్మ విజయ యాత్ర–2025’లో భాగంగా హైదరా బాద్ విచ్చేసిన విధుశేఖర భారతీ స్వామీజీ.. శంకరమఠంలో విడిది చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధితోపాటు ముఖ్యంగా వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి వివరాలను స్వామీజీకి సీఎం వివరించారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్ కొత్త గ్లోబల్ ఆఫీసు
నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మెక్‌డొనాల్డ్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త గ్లోబల్ ఆఫీసును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా మెక్‌డొనాల్డ్ ఈ గ్లోబల్ ఆఫీసును ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆఫీస్ ఫైనాన్స్, హెచ్‌ఆర్, సోర్సింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, టెక్నాలజీ వంటి కార్పొరేట్ కార్యకలాపాలకు సంబంధించిన బృందాలు ఇక్కడ నుంచే పనిచేస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా సంస్థకు ఉన్న 43 వేల రెస్టారెంట్లు, 65 మిలియన్ల మంది కస్టమర్లను ప్రభావితం చేసే కార్యకలాపాలపై ఈ గ్లోబల్ ఆఫీసు పనిచేస్తుంది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయం నాలుగు అంతస్తుల్లో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గ్లోబల్ ఆఫీసులో వివిధ కార్యకలాపాల కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియను మెక్ డొనాల్డ్ ఇప్పటికే ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


