Hyderabad: అనాథ అక్కాచెల్లెళ్లను కలిపిన ‘సైన్స్‌ ఫేర్‌’ ఫోటో

Three Orphan Sisters Reunited in Hyderabad With Photos From Science Fair - Sakshi

అనాథ అక్కచెల్లెళ్లను కలిపిన సైన్స్‌ ఫేర్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిలో పెద్దవారు ఇద్దరిని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. చిన్న అమ్మాయి వారి నానమ్మతాతయ్యల దగ్గర ఉంటుంది. కానీ దురదృష్టం కొద్ది వారు కూడా చనిపోవడంతో.. ఆ బాలిక వీధుల వెంబడి భిక్షాటన చేస్తూ కాలం గడపసాగింది. ఈ క్రమంలో తన అక్కలను చేరదీసిన అనాథాశ్రమం వారే ఆ బాలికను కూడా అక్కున చేర్చుకున్నారు. అయితే వేరే బ్రాంచ్‌లో ఆ చిన్నారిని చేర్పించారు. చివరకు సైన్స్‌ ఫేర్‌ ఫోటోలో చెల్లెని గుర్తించిన అక్కలు తన గురించి హోమ్‌ నిర్వహకులకు సమాచారం ఇ‍వ్వడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒకే చోటకు చేర్చారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిని ఆ చిన్నారులు.. కనీసం అందరం ఒకే చోట ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అమ్మ వారి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి(14), మరో అమ్మాయి(12)ని నగరంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఇక అందరికంటే చిన్నదైన బాలిక తన తాతనానమ్మల దగ్గర ఉండేది. కానీ దురదృష్టం కొద్ది కొన్ని నెలల క్రితం వారు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవించసాగింది.

బాలిక గురించి సమాచారం తెలిసిన అనాథాశ్రమం వారు ఆ చిన్నారిని చేరదీశారు. విచిత్రం ఏంటంటే చిన్నారి అక్కలిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. కాకపోతే వేరే బ్రాంచ్‌లో. ఇక దీని గురించి ఆ అక్కాచెల్లెళ్లలకు ఏమాత్రం సమాచారం తెలీదు. ఈ క్రమంలో ఓ రోజు వేర్వేరు అనాథశ్రమాల్లో నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌ ఫోటోలను బాలిక అక్కలు చూశారు. ఆ ఫోటోలో ఉన్న తమ చెల్లిని గుర్తించారు. 

ఇక దీని గురించి ఆ‍శ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ముగ్గురు బాలికలకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి.. వారంతా తోబుట్టువులే అని తేల్చారు. అనంతరం ముగ్గురిని ఒకే చోటకు చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్క చోట కలిసి ఉండే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో ఉన్న పలు అనాథాశ్రమాల్లో అధికారులు, కౌన్సిలర్లు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తారు. అలానే సైన్స్‌ ఫేర్‌ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒక్కచోటకు చేర్చింది’’ అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top