నిర్మల్‌చైన్‌గేట్: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టు బడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యాసంగి సీజన్‌లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ని రైతులకు ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థికసాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎ క్కువ భూమి ఉన్న వారు నిరాశకు లోనయ్యారు.
2018లో పథకం ప్రారంభం..
రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్‌లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్‌లో పెట్టుబడి సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. 2025లో వానాకాలం సీజన్‌లో 1,88,597 మంది రైతులకు రూ.268.85.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.
రూ.7,500 సాయం ఎప్పుడో..
రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆందిస్తోంది. రూ.7,500 హామీ మాత్రం అమలు కావడం లేదు.
వడ్డీ వ్యాపారులే దిక్కు!
గతంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం..
రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. – అంజిప్రసాద్, డీఏవో
రెండెకరాలకు మాత్రమే..
2025–26 యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.88 లక్షల మంది రైతులకు రూ.168 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్‌లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది.


