కష్టాల్లో కౌలు రైతు | tenant farmers survey report recognition in telangana | Sakshi
Sakshi News home page

కష్టాల్లో కౌలు రైతు

Jun 10 2026 5:53 AM | Updated on Jun 10 2026 5:53 AM

tenant farmers survey report recognition in telangana

గుర్తింపు లేక.. ప్రభుత్వ ఫలాలు అందక అప్పుల ఊబిలోకి..

యాప్‌లో భూమి యజమానికే హక్కులు 

యూరియా కొనాలన్నా.. పంట అమ్మాలన్నా తిప్పలే 

పరిహారమూ దక్కట్లేదు 

కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నది కౌలు రైతులే అయినా, ప్రభుత్వ పథకాలు, మద్దతు వ్యవస్థలు కేవలం పట్టాదారులకే పరిమితం కావడం వల్ల వీరు దారుణమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో వ్యవ సాయాన్ని ప్రధానంగా కౌలు రైతులే నడిపిస్తున్నా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, ప్రకృతి విపత్తు పరిహారం వంటి కీలక మద్దతు వ్యవస్థలకు వారు దూరమవుతున్నారు.

కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే–2026’లో 22 జిల్లాల్లోని 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేశారు. సర్వే ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి నేతృత్వంలో సాగింది. మంగళవారం అధ్యయన నివేదికను జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ హరగోపాల్, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళి, జస్టిస్‌ చంద్రకుమార్‌ తదితరుల సమక్షంలో హైదరాబాద్‌లో విడుదల చేశారు.  

పెరిగిన కౌలు ధరలు.. తగ్గిన నికర ఆదాయం 
తెలంగాణలో కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. గరిష్టంగా ఎకరాకు రూ.53,000 వరకు వసూలు చేస్తున్నారని సర్వేలో తేలింది. 2022లో సగటున 5 ఎకరాలుగా ఉన్న కౌలు భూమి, ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న కౌలు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సి వస్తుండగా, ఉన్న తక్కువ నికర ఆదాయం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఎక్కువ భూమి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వే పేర్కొంది.  

ఓటీపీలతో యూరియా కొనుగోలు, పంట అమ్మకాల అవస్థలు 
యాసంగి సీజన్‌లో ప్రవేశపెట్టిన యాప్‌ ఆధారిత యూరియా పంపిణీ విధానం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్టు అధ్యయనం తేల్చింది.  
భూ యజమాని ఓటీపీ తప్పనిసరి కావడంతో సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో కేవలం 412 మంది (22.8 శాతం) మాత్రమే సబ్సిడీ యూరియాను పొందగలిగారు. వారిలో కూడా కేవలం 40 మంది మాత్రమే తమ పేర్లపై యూరియా తీసుకున్నారు. మిగతావారు భూ యజమానుల వివరాలపై ఆధారపడాల్సి వచి్చంది. సబ్సిడీ అందని రైతులు బహిరంగ మార్కెట్లో ఒక్కో సంచికి రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. 

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ పేర్లతో సీసీఐకి విక్రయించగలిగారు.  
వరి విషయంలో ఖరీఫ్‌లో 20 శాతం, యాసంగిలో 17.2 శాతం మంది మాత్రమే తమ పేరుతో విక్రయించినట్టు సర్వే వెల్లడించింది. మిగతా వారు ఇతరుల పేర్లతో విక్రయించి కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. 

ప్రకృతి విపత్తు పరిహారం కూడా అందని ద్రాక్షే 
గత మూడు సంవత్సరాల్లో వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. అయితే బాధితుల్లో కేవలం 11 మందికి మాత్రమే, అంటే 0.7 శాతం మందికి మాత్రమే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమైంది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు పరిహారం తీసుకొని కౌలు రైతులకు ఇవ్వలేదని సర్వే గుర్తించింది. పంట రుణాలు భూయజమానులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో కౌలు రైతులు పూర్తిగా ప్రైవేట్‌ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నట్టు రైతులు తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రైవేట్‌ అప్పుల భారం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రుణమాఫీ పథకాల ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదని పేర్కొంది.  

ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరలకు అమ్మకాలు 
ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు లేకపోవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని సర్వే తెలిపింది. దీంతో 5 ఎకరాల కౌలు రైతుకు పత్తిలో రూ.64,400, వరిలో రూ.40,350, మొక్కజొన్నలో రూ.87,800, సోయాబీన్‌లో రూ.53,120 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా వేసింది. ఎరువుల సబ్సిడీ, పంట కొనుగోలు, విపత్తు పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోకి చేరేలా వ్యవస్థను రూపొందించాలని కోరింది.  

‘కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి’ 
హిమాయత్‌నగర్‌ : కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నివేదిక విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా అందించాలన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2011 లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కల్పించాలని చెప్పారు. సీఎం, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement