సైబర్‌క్రైం కేసులు పెడతాం.. సిబ్బందిని బెదిరించిన తెయూ వీసీ

Telangana University VC Fires On University Employees In Nizamabad - Sakshi

సాక్షి, తెయూ(నిజామాబాద్‌): యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు ఫొటోలు తీసి ఎవరైనా మీడియాకు అందజేస్తే వారిపై సైబర్‌ క్రైం నేరం కింద కేసులు పెట్టిస్తామని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ హెచ్చరించారు. పాలక మండలి (ఈసీ) అనుమతి లేకుండా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఇటీవల సుమారు 50 మంది బోధనేతర సిబ్బంది నియామకాలపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదే విషయమై బుధవారం సాయంత్రం 6 గంటలకు బోధన, బోధనేతర, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు సిబ్బందికి బుధవారం 4 గంటలకు స మాచారం ఇచ్చారు. దీంతో 5 గంటలకు విధు లు ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన సిబ్బంది క్యాంపస్‌లోనే ఉండిపోయారు. వీసీ రవీందర్‌ తో పాటు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కనకయ్య రాత్రి 7 గంటల తర్వాత ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో సిబ్బందితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి ఒక విజన్‌తో ముందుకు వె ళుతున్న తనను  కొందరు అసత్య ఆరోపణల తో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెయూ పరిధిలో మెయిన్‌ క్యాంపస్‌ (డిచ్‌పల్లి), సౌత్‌ క్యాంపస్‌(భిక్కనూర్‌), ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ (సారంగపూర్‌) మూడు క్యాంపస్‌లు ఉన్నాయని, సిబ్బంది కొరత వల్లనే అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

మూడు క్యాంపస్‌లు ఉన్న విషయం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలియదని వీసీ పేర్కొనడంతో బోధన, బోధనేతర సిబ్బంది అవాక్కయ్యారు. ప్రస్తుత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి గతంలో రెండు సార్లు తెయూ రిజిస్ట్రార్‌ గా పని చేసిన విషయం తెలిసిందేనని ఆయనకు ఎన్ని క్యాంపస్‌లు ఉన్నాయో తెలియదా అని వారు నవ్వుకున్నారు.

సిబ్బంది నియామకాలపై మీడియాలో వార్తలు వస్తే సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం ఏంటని పలువురు వాపోయా రు. రాత్రి 7.45 గంటలకు సమావేశం ముగించడంతో ఈ సమయంలో తాము ఇళ్లకు ఎలా వె ళ్లాలని మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రిన్సిపాల్‌ ఆఫీస్‌ నుంచి ఫొటోలు వెళ్లాయనుకుంటే వారితోనే సమావేశం నిర్వహించాలే కానీ మెయిన్‌ క్యాంపస్, ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లకు చెందిన అందరినీ పిలిపించి బెదిరింపులకు పాల్పడితే ఏమిటని ప్రశ్నించారు.  

చదవండి: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్‌ ఫిదా: ‘పేపర్‌ వేస్తే తప్పేంటి’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top