10 రోజుల్లో ప్రాజెక్టుల వివరాలివ్వండి

Telangana To Submit Reports Of Projects In Krishna And Godavari River Basins - Sakshi

తెలంగాణ, ఏపీకి కృష్ణా, గోదావరి బోర్డుల ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌లలోని ప్రాజెక్టుల వివరాలు, ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వివరాలను 10 రోజుల్లోగా తమకు సమర్పించాలని రెండు బోర్డులు తెలుగు రాష్ట్రాలను మరోసారి ఆదేశించాయి. అలాగే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలను సైతం సమర్పించాలని కోరాయి.

గెజిట్‌ నోటిఫికేషన్ల అమలుపై చర్చించేందుకు బోర్డులు ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ భేటీలకు బోర్డుల సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండేతోపాటు తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టుల వివరాలను 10 రోజుల్లో ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించగా కొన్ని ప్రాజెక్టుల వివరాలపై ఏపీ అభ్యంతరం తెలిపింది.

ముఖ్యంగా బనకచర్లకు సంబంధించి వివరాలు అవసరం లేదని ఏపీ ఇంజనీర్లు చెప్పినట్లు తెలిసింది. అయితే అన్ని వివరాలు సమర్పించాలని, అక్కర్లేని వాటిపై తదుపరి భేటీలో చర్చిద్దామని బోర్డు ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే వారం కేంద్రం కొత్తగా నియమించిన ఇద్దరు సీఈలు విధుల్లో చేరుతున్నారని, వారికి అన్ని వివరాలు తెలియజేయాల్సి ఉందని బోర్డుల అధికారులు వివరించారు. ఏయే ప్రాజెక్టులు ఏ బోర్డు పరిధిలో ఉండాలన్న విషయం తేలాక కేంద్ర బలగాల భద్రత అంశాన్ని చర్చిద్దామని ఇరు రాష్ట్రాలు తెలిపినట్లు సమాచారం. సీడ్‌ మనీ అందించడంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలపగా అందుకు బోర్డులు అంగీకరించాయి. ఈ భేటీలో ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై చర్చించలేదని తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top