 
													సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ గడువు నేటితో ముగియడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడువును పొడిగించాలని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో మూడునెలల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ జులై 31వ తేదీన సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపుదారుల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తే అవసరమైతే వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు సూచించింది కూడా.
అయితే.. ఇప్పటిదాకా నలుగురి విచారణ మాత్రమే జరిగిందని, మిగిలిన వాళ్లను విచారించేందుకు రెండు నెలల గడువు పొడిగించాలని స్పీకర్ తరఫున తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
