సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు తాజాగా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) కేటీఆర్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు విషయంలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా రేపు(శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. సిటీలోని నంది నగర్‌లో ఉన్న కేటీఆర్‌కు నివాసానికి వెళ్లిన పోలీసులు.. అక్కడే నోటీసులు అందజేశారు. 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఇప్పటికే సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. కేటీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లకు భయపడే ప్రసక్తే లేదు. నాకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నీ వెంట పడుతాం. నీ బావ మరిది కుంభకోణం బయటపడొద్దనే ఇలా డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారు. నేను, కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే మాకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులకు భయపడేది లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటాం అని హెచ్చరించారు.



