
ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు కమిటీ ఏర్పాటుపై తెలంగాణ వెనుకడుగు
బనకచర్లపై ఏపీతో చర్చలకు వెళ్లొద్దని తాజాగా నిర్ణయించిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై చర్చల కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలనే అంశంపై తెలంగాణ వెనుకడుగు వేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెల 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.
తెలంగాణ, ఏపీ నుంచి చెరో ఐదుగురు అధికారులతోపాటు కేంద్ర జలశక్తి శాఖ నుంచి మరో ఇద్దరు అధికారులు కలిపి మొత్తం 12 మందితో వారం రోజుల్లో కమిటీ నియమించాలని అప్పట్లో నిర్ణయించగా, నెల రోజులు గడిచినా ముందడుగు పడలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై ఆ రాష్ట్రంతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ నిర్ణయించింది. తమ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏపీ మొండిగా ముందుకుపోతుండటంతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
మరోవైపు కమిటీ ఏర్పాటుకు పేర్లను సూచించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఇరు రాష్ట్రాలకు ఎలాంటి లేఖ అందలేదు. కమిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయగా, ఈ విషయంలో తెలంగాణకు లేఖ రాసేందుకు కేంద్ర జలశక్తి శాఖ నిరాకరించినట్టు తెలిసింది.
గోదావరిలో పోలవరం ప్రాజెక్టు వద్ద 650 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అందులో నుంచి 200 టీఎంసీలను గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం నివేదిక సమరి్పంచగా.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖలు రాశాయి. ఇలాంటి ప్రాజెక్టుపై ఏపీతో చర్చలకు వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించవచ్చనే భావనతోనే తెలంగాణ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
మినిట్స్ లేని సమావేశం
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశం అనధికారికమని, ఆ భేటీలోని నిర్ణయాలకు సంబంధించి ‘మినిట్స్’సైతం రికార్డు చేయొద్దని ముందే ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో నిర్వహించే సమావేశాల మినిట్స్‌ను కొన్ని రోజుల తర్వాత సంబంధిత రాష్ట్రాలకు పంపించడం ఆనవాయితీ.
ముందే జరిగిన నిర్ణయం మేరకు కేంద్ర మంత్రి సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఆ శాఖ రూపొందించలేదని అధికారవర్గాలు తెలిపాయి. మినిట్స్ రికార్డు చేయవద్దని చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటించగా, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం చర్చ జరిగిందని చెప్పారు.
దీనిపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశం మినిట్స్ బయటకి వస్తే చర్చ జరిగిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. అయితే, మినిట్స్ రికార్డు చేయొద్దని తీసుకున్న నిర్ణయంతో ఆ అవకాశం లేకుండా పోయింది.