
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్ 27) విచారణ జరిపింది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడం.. రాజ్యాంగ విరుద్ధమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు.
ప్రభుత్వం తరపున ఏజీ వర్చువల్‌గా హాజరుకాగా.. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తావించింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా.. గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా ఇస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. మేం జోక్యం చేసుకోవద్దంటే.. ఎన్నికలకు వెళ్లమని హామీ ఇవ్వండి. 10 రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టమని హామీ ఇవ్వాలన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆలోచన ఏంటో ఏజీ చెప్పాలని పేర్కొంది.
‘‘ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించొచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. మూడు రోజుల క్రితమే రిజర్వేషన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారంటూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) జీవో విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.