తెలంగాణలో పెట్టుబడి పెట్టండి

Telangana: Minister KTR Promotes State Investment Opportunities In Paris - Sakshi

పారిస్‌లోని పలు సంస్థల సీఈవోలు, అధిపతులతో మంత్రి కేటీఆర్‌ వరుస భేటీలు 

తెలంగాణను సందర్శించాల్సిందిగా ఫ్రెంచ్‌ సంస్థలకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పారిస్‌లోని పలు సంస్థలకు వివరించారు. తన పారిస్‌ పర్యటనలో భాగంగా గురువారం కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం అక్కడి వివిధ సంస్థల సీఈవోలు, పరిశ్రమల అధిపతులతో వరుస భేటీలు జరిపింది. ప్రపంచంలోని అతిపెద్ద క్షిపణివ్యవస్థల తయారీలో పేరొందిన ఎంబీడీఏకు చెందిన అత్యున్నత బృందంతో కేటీఆర్‌ భేటీ అయ్యారు.

ఎంబీడీఏ డైరెక్టర్‌ బోరిస్‌ సోలొమియాక్, పాల్‌నీల్‌ లీ లివెక్‌తో పాటు భారత్, ఆసియా వ్యవహారాలు చూసే సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షులు జీన్‌ మార్క్‌ పీరాడ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. తయారీ రంగంలో తెలంగాణలో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఎంబీడీఏ బృందాన్ని కేటీఆర్‌ కోరారు. వరుస భేటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ‘ఏరోక్యాంపస్‌ ఎక్వటైన్‌’సేల్స్‌ డైరెక్టర్‌ జేవియర్‌ అడిన్‌తోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఎయిర్‌ అటాషెగా ఉన్న ఎయిర్‌ కమెడోర్‌ హిలాల్‌ అహ్మద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

భారత రాయబారితోనూ భేటీ 
ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్‌ అష్రఫ్‌తోనూ కేటీఆర్‌ బృందం భేటీ అయింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయనకు వివరించారు. ఫ్రెంచ్‌ కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశమున్న ప్రాధాన్య రంగాల గురించి మదింపు చేయాలని కోరారు.

కాస్మెటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బిచరొవ్‌తో జరిగిన భేటీలో తెలంగాణలో కాస్మెటిక్స్‌ తయారీకి ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీలో కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top