వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదు | Telangana High Court reiterates police cannot seize vehicles solely for drunk driving | Sakshi
Sakshi News home page

వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదు

Apr 11 2026 5:32 AM | Updated on Apr 11 2026 5:32 AM

Telangana High Court reiterates police cannot seize vehicles solely for drunk driving

మద్యం తాగి నడిపే కేసుల్లో తేల్చిచెప్పిన హైకోర్టు.. 2021లో ఇచ్చిన ఆదేశాలనూ పాటించాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి నడుపుతున్న వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, గుర్తింపు రుజువు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సమర్పించిన వెంటనే వాహ నాన్ని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పలు సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. తన మహేంద్ర ఎక్స్‌యూవీ 500 వాహనాన్ని అల్వాల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారంటూ కూకట్‌పల్లికి చెందిన జె.విజయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌ వాహనాన్ని నడుపుతుండగా వాహనంలోని మరో వ్యక్తి మద్యం సేవించి ఉన్నారనే కారణంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటన సమ యంలో ఏం చేయాలో ఇదే హైకోర్టులో 2021లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసే సందర్బాల్లో వాహనం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంది’అని చెప్పారు. హోం శాఖ తరఫు ఏజీపీ వాదనలు వినిపిస్తూ.. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడపడంలో పాల్గొన్నారన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి పిటిషనర్‌ పత్రాలతో పోలీసులను సంప్రదించలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. 

 డ్రైవర్‌ లేదా రైడర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు తేలితే వాహనాన్ని నడపడానికి అనుమతించరాదు. అయితే, అతనితో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో లేకుంటే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం ఆ వ్యక్తిని వాహనం నడపడానికి అనుమతించాలి.
వాహనాన్ని తన అదుపులో ఉంచుకున్న పోలీసులు, మరే ఇతర అధికారి అయినా, సదరు వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, గుర్తింపు రుజువు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సమర్పించిన మీదట దానిని యజమానికి, ఏదైనా అధీకృత వ్యక్తికి అప్పగించాలి. 

  డ్రైవర్, వాహన యజమాని.. వీరిపై న్యాయపరమైన చర్యలు అవసరమని పోలీసులు ఒక నిర్ణయానికి వస్తే, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు వారిపై చార్జిషీట్‌ దాఖలు చేయాలి. 

చార్జిషీట్లు ఇతరత్రా సక్రమంగా ఉంటే మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448–ఏ(4)కు అనుగుణంగా, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు ఆ చార్జిషీట్లను స్వీకరించాలని మేజిస్ట్రేట్‌లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.
ఈ ఆదేశాలతోపాటు 2021లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే ‘కోర్టు ధిక్కరణ’గా పరిగణిస్తాం. సంబంధిత పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటాం అంటూ పిటిషన్‌ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement