కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ | Telangana High Court issues interim stay on Kalyana Lakshmi and Shaadi Mubarak schemes | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌

Aug 20 2026 3:50 PM | Updated on Aug 20 2026 4:08 PM

Telangana High Court issues interim stay on Kalyana Lakshmi and Shaadi Mubarak schemes

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ లబ్ధిదారులకు భారీ షాక్ తగిలింది. ఈ రెండు పథకాలపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ పథకాలపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం నిధుల దుర్వినియోగంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు రాక చాలామంది ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం? కష్టపడి పని చేసే ప్రజల ట్యాక్స్ డబ్బును ఇలా ఉచిత పథకాలకు మళ్లించడం న్యాయమేనా?’ అంటూ న్యాయస్థానం నిలదీసింది.  

ప్రభుత్వ ప్రాధాన్యతలను తప్పుబడుతూ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయి బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. అర్హులైన భూ బాధితులకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తూ, శాసనసభ ఆమోదం లేని ఇటువంటి ఉచిత పథకాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల లభ్యత,ప్రాధాన్యతలపై ప్రభుత్వం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని ధర్మాసనం సీరియస్ అయ్యింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇవ్వడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి పూర్తిస్థాయి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలపై స్టే యథాతథంగా కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement