
శిఖం పట్టా భూమిలో మీరెలా జోక్యం చేసుకుంటారు?
నీటిపారుదల శాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు
శిఖం సర్కారీ భూమి, శిఖం పట్టా భూమి మధ్య తేడా ఉంది
అధికారులను కూర్చోబెట్టి చట్టాలు నేర్పాలన్న న్యాయమూర్తి
పిటిషనర్లు పరిహారం పొందడానికి అర్హులని స్పర్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనీస చట్టాలు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని హైకోర్టు అçసహనం వ్యక్తం చేసింది. ఆయా శాఖల పరిధిలో పనిచేసే అధికారులు చట్టాలు తెలుసుకోవాలని సూచించింది. వీలైతే వారికి తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం మల్కపేట చెరువులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని నింపేందుకు చేపట్టిన కాలువ పనులను ఆపేయాలని కోరుతూ తండు చంద్రయ్య సహా మరో 10 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పనుల కారణంగా తమ పట్టా భూములు శాశ్వతంగా ముంపునకు గురవుతాయని తెలిపారు. దీనిపై మే 9న తాము అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని పేర్కొన్నారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదనలిలా..: పిటిషనర్ తరఫున న్యాయవాది సందీప్ వాదనలు వినిపించారు.. ‘శిఖం సర్కారీ భూములు.. తెలంగాణ భూమి రెవెన్యూ చట్టం 1317 ఫస్లీలోని సెక్షన్ 24 ప్రకారం సర్కారువేనన్నారు. శిఖం పట్టా భూములు ప్రైవేట్ భూములు..’అని నివేదించారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పిటిషనర్లు పరిహారానికి అర్హులని, పరిహారం చెల్లించిన తర్వాత కాలువ నిర్మాణం చేపట్టవచ్చునని చెప్పారు. ‘ఎఫ్‌టీఎల్‌లో ఉన్న పిటిషనర్ల భూములు ఎప్పుడూ నీటిలో మునిగే ఉంటున్నాయి. పిటిషనర్లు తరచుగా ప్రధాన కాలువ పనులను అడ్డుకుంటున్నారు. తమ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే భూములకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు..’అంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు.
పిటిషనర్లు సంబంధిత ఆస్తికి పట్టాదారులు
‘శిఖం పట్టా అంటే ఏమిటి? అందులో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చన్నది కూడా నీటి పారుదల శాఖ అధికారులకు తెలియడం లేదు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో ఉన్నంత మాత్రాన ప్రతీది సర్కార్ భూమి కాదు. శిఖం సర్కారీ, శిఖం పట్టా భూములు వేర్వేరుగా ఉంటాయి. శిఖం సర్కారీ భూములు పూర్తిగా ప్రభుత్వానివే. అందులో అధికారులు ఏ పనులైనా చేపట్టవచ్చు. కానీ శిఖం పట్టా భూములు ప్రైవేట్‌వి. మామూలుగా వర్షాకాలం నీటి మునక ఉంటుంది కనుక సాగు సాధ్యంకాదు.
రబీ సీజన్‌లో మునక తగ్గినప్పుడు వాటిలో పట్టాదారులు పంటను సాగుచేస్తారు. ఆ భూములపై పూర్తి హక్కు వారిదే. ప్రభుత్వ అవసరం కోసం ఆ భూములు తీసుకోవాలని భావిస్తే శిఖం పట్టాదారులు పరిహారానికి అర్హులు. ఎఫ్‌టీఎల్‌లో ఉంది కదా అని పట్టాభూముల నుంచి కాల్వ తవ్వకం చేపడతామంటే ఎలా? పిటిషనర్లు సంబంధిత ఆస్తికి పట్టాదారులు. అధికారులందరినీ కూర్చోబెట్టి నీటి పారుదల, రెవెన్యూ చట్టాలు నేర్పించండి. కాల్వల తవ్వకానికి ఈ న్యాయస్థానం వ్యతిరేకం కాదు..’అని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.