
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఓపెన్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయం
ఈ నెల 20న వేలానికి నోటిఫికేషన్
బిల్డర్లు, హౌసింగ్ సంస్థలకు విక్రయించేందుకు నిర్ణయం
ఈ నిధులతో సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయం ద్వారా సేకరించిన నిధులను ఓఆర్‌ఆర్ పరిసరాలు, జిల్లాల్లో ఇళ్లను నిర్మించి సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడానికి వినియోగించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీన వీటి వేలానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ వేలానికి ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లను, ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నట్లు చెప్పారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కోదాంట్లో దాదాపు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లను ఏక మొత్తంగా విక్రయించనున్నట్లు వివరించారు. బిల్డర్లు, ఒక గ్రూపుగా ఏర్పడి కొనుగోలు చేయాలనుకునేవారు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు అవసరం ఉన్న సంస్థలు వీటిని కొనుగోలు చేసే వీలు కల్పిçస్తున్నట్లు చెప్పారు.
వేలం వేయనున్నవి ఇవే..
రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్‌గూడలో 20, చందానగర్‌లో 3, బహదూర్‌పల్లిలో 69 ఓపెన్ ప్లాట్లు, బండ్లగూడలో పూర్తయిన 159 ఫ్లాట్లు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని ఐదు టవర్లలో పూర్తికాని కట్ట డాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ స్థాయిలోని ఫ్లాట్లు వేలం వేయను న్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పోతుల మడుగులో 111, అమిస్తాపూర్‌లో 45 ఓపెన్ ప్లాట్లు, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా విక్రయించనున్నారు.
కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో 7.33 ఎకరాలు..
కూకట్‌పల్లిలోని హౌసింగ్‌బోర్డు 4వ ఫేజ్‌లో ఖాళీగా ఉన్న 7.33 ఎకరాలు, అదే కాలనీలో ఉన్న మరో రెండు ప్లాట్లను (4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు) కూడా ఈ వేలంలో విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డినగర్‌లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌కు చెందిన 2,605 చదరపు గజాలను విక్రయిస్తామన్నారు. సంజీవరెడ్డినగర్‌లోని కమ్యూనిటీ హాల్ (సెల్లార్, స్టిల్ట్, జి+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణం, 37,030 అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉన్నదని, దీనిని ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసమే వేలం వేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు.