ఫోర్టిఫైడ్‌ రైస్‌గా తడిసిన ధాన్యం | Telangana Government Will Convert Wet Grain in Rice Mill Into Fortified Rice | Sakshi
Sakshi News home page

ఫోర్టిఫైడ్‌ రైస్‌గా తడిసిన ధాన్యం

Aug 10 2022 9:46 AM | Updated on Aug 10 2022 9:51 AM

Telangana Government Will Convert Wet Grain in Rice Mill Into Fortified Rice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైస్‌మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్‌ రైస్‌ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్‌ ఫోర్టిఫైడ్‌ రైస్‌గా మార్చాలని సర్కారు నిర్ణయించింది.

ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సెంట్రల్‌ పూల్‌ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్‌ బియ్యంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది.

ఫోర్టిఫైడ్‌ రైస్‌గా 5 ఎల్‌ఎంటీ...
రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో గత మూడు సీజన్‌లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్‌ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్‌ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్‌ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి.

ఈ మూడు సీజన్‌ల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల పారాబాయిల్డ్‌ ఫోర్టిఫైడ్‌ రైస్‌ను మిల్లింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్‌ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్‌ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్‌ రైస్‌గా మిల్లింగ్‌ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది.
చదవండి: అనగనగా హైదరాబాద్‌.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 

20 ఎల్‌ఎంటీ ఫోర్టిఫైడ్‌  బాయిల్డ్‌ రైస్‌ కోసం..
రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్ను­ల మేర ఫోర్టిఫైడ్‌ బియ్యంగా సెంట్రల్‌ పూల్‌కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 34 ఎల్‌ఎంటీ ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడి­బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్‌ మిల్లింగ్‌ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్‌ఎంటీ ఫోర్టిఫైడ్‌ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్‌ఎంటీ ఫోర్టిఫైడ్‌ రైస్‌ కోసం 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement