సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రమవుతోంది. వచ్చే జూలై 7వ తేదీతో రెండేళ్ల పదవీ కాలం ముగియనున్న 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు మళ్లీ తమకే కావాలంటూ ప్రస్తుత చైర్మన్లు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సహా వీలైన అన్ని మార్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షిలపై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి ఢిల్లీ నుంచి కూడా సీఎం, పీసీసీ చీఫ్‌లకు చెప్పిస్తున్నారని సమాచారం. దీంతో ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అంత ఈజీ కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఎవరిని కొనసాగించాలి.. ఎవరిని తప్పించాలి?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వీరంతా గత రెండేళ్లుగా ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూలై 7వ తేదీతో వీరి పదవీకాలం ముగియనుంది. దీంతో మిగిలిన కార్పొరేషన్లు కూడా కలిపి మొత్తం 50 మంది వరకు చైర్మన్లను నియమించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇటీవల కుల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు మహిళా కమిషన్ నియామకం సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్‌చార్జీల మధ్య ఈ నియామకాలకు సంబంధించిన చర్చ కూడా జరిగింది.
కీలక కార్పొరేషన్లకు కొత్తగా ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమించే అంశం ఇప్పటికే హైకమాండ్ పరిధిలో ఉన్న నేపథ్యంలో మిగిలిన కార్పొరేషన్లకు నూతన సారథులను నియమించడంతో పాటు ప్రస్తుతమున్న వారిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఈ చర్చ జరిగినట్టు సమాచారం. కొత్త చైర్మన్ పదవుల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, పాత వారిని కొనసాగించే విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలనే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు నేతలు అభిప్రాయపడినట్టు గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
రెన్యువల్ వద్దనుకున్నా..
వాస్తవానికి మొదటి దఫాలో నియమితులైన వారిలో ఎవరినీ మళ్లీ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించవద్దని సీఎం రేవంత్ గతంలోనే నిర్ణయించారు. ఒకరిని కొనసాగించి మరొకరిని తప్పిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని, కొత్తగా ఎక్కువమందికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేసినట్టవుతుందనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే పదవుల రెన్యువల్ విషయంలో ఒత్తిడి తీవ్రం కావడంతో కనీసం ఐదారుగురిని అయినా కొనసాగించాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఎవరిని కొనసాగించాలనే విషయంలో కూడా తనకు స్పష్టత ఉందని ఆయన తన సన్నిహితుల వద్ద చెపుతున్నట్టు సమాచారం. తమ పదవులు రెన్యువల్ చేయాలని చైర్మన్లు అడిగిన సందర్భంలో ఎవరెలా పనిచేశారో తన వద్ద నివేదికలున్నాయని ఆయన చెబుతుండటం గమనార్హం.
10 మంది లోపే ఫస్ట్ క్లాస్!
మొత్తం 37 మందిని నియమిస్తే వారి పనితీరును బట్టి 10 మంది లోపే ఫస్ట్ క్లాస్ (60 శాతం) మార్కులు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత వారిలో ఎంత మందిని కొనసాగించాలి, కొత్తగా ఎవరిని నియమించాలన్న దానిపై జూన్ రెండో వారంలో మరోమారు భేటీ జరుగుతుందని, ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవుల విషయంలో హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్న తర్వాత జూన్ 25 తర్వాత కొత్త నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి.


