మేడారంలో సీఎం రేవంత్‌ పూజలు | Telangana CM Revanth reddy visited medaram sammakka saralamma temple | Sakshi
Sakshi News home page

మేడారంలో సీఎం రేవంత్‌ పూజలు

Aug 17 2026 1:25 AM | Updated on Aug 17 2026 1:26 AM

Telangana CM Revanth reddy visited medaram sammakka saralamma temple

మేడారంలో తల్లులకు మొక్కుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, చిత్రంలో పొంగులేటి, సీతక్క, వేం నరేందర్‌ రెడ్డి, బలరాం నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మహేశ్‌ గౌడ్‌

చేయూత, సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ

ములుగు/ఎస్‌ఎస్‌ తాడ్వాయి/ములుగు రూరల్‌: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మేడారం చేరుకున్న రేవంత్‌.. ప్రత్యేక కాన్వాయ్‌లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ సంస్కృతీ, 
సంప్రదాయ పద్ధతిలో రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సమ్మక్క–సారలమ్మ పూజారులు, అధికారులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.

అమ్మవార్ల సన్నిధిలో సీఎం ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేశారు. ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీరసారెలతో అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు చీరసారె, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధిపనులను పరిశీలించారు.   

రేవంత్‌రెడ్డి బరువు 67 కేజీలు
మేడారం అమ్మవార్లకు సీఎం రేవంత్‌రెడ్డి తులాభారం నిర్వహించగా ఆయన 67 కేజీల బరువు ఉన్నారు. ఈ ఏడాది మహాజాతర సమయంలో అమ్మవార్లకు తులాభారం నిర్వహించిన ఆయన బరువు 68 కేజీలుగా ఉంది. జాతర జరిగి ఆరు నెలలు దాటగా రేవంత్‌రెడ్డి కిలో బరువు తగ్గారు. 

పింఛన్ల పంపిణీ
24 మంది మహిళలకు చేయూత పింఛన్లు, గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 24 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత పింఛన్లు అందజేశారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అంశాలు అడిగి తెలుసుకున్నారు. 

పైలాన్‌ ఆవిష్కరణ
ములుగు జిల్లా కేంద్రం శివారు గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్‌ను మంత్రి సీతక్క చేతులమీదుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావును కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement