
టీజీఎల్‌పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్విసెస్ విభాగంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీఎల్‌పీఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్–1లో 50 పోస్టులు, మల్టీజోన్–2లో 68 పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీజీఎల్‌పీఆర్బీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను తర్వలోనే వెల్లడిస్తామన్నారు. ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. తెలంగాణలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు అడ్వొకేట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని సూచించారు.
అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 34 ఏళ్లు మించి ఉండకూదని తెలిపారు. రిజర్వేషన్ల వారీగా మినహాయింపులున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు, ఎక్స్ సర్విస్‌మెన్ (ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లేదా ఇండియన్ నేవీలో పనిచేసిన వారికి మాత్రమే) మూడేళ్ల సడలింపు వర్తిస్తుందని వెల్లడించారు. అదనపు వివరాలకు అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. దరఖాస్తు తేదీలు ప్రకటించిన వెంటనే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెస్తామని శ్రీనివాసరావు తెలిపారు.