
నక్షా మ్యాప్‌లు కూడా ఖరారు
నక్షా లేని గ్రామాల్లో రీసర్వే చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పైలట్ పద్ధతిలో భూముల రీసర్వే నిర్వహించిన రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో త్వరలోనే సర్వే మ్యాప్ నిబంధనతో పాటు భూధార్ కార్డుల జారీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని, సర్వే పూర్తయిన ఐదు గ్రామాలకు త్వరలోనే నక్షా మ్యాప్‌లు కూడా ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద సలార్‌నగర్, కొమ్మనాపల్లి, మొలుగుమాడ, నూగూరు, షాహిద్‌నగర్ గ్రామాల్లో జరిగిన రీసర్వేపై బుధవారం సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్‌కుమార్, సర్వే శాఖ కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతులతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఐదు గ్రామాలకు చెందిన ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆ గ్రామాల్లో భూముల రీసర్వేలో పాల్గొన్న ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆయా గ్రామాల్లో సర్వే జరిగిన తీరును మంత్రి తెలుసుకున్నారు. సర్వే నిర్వహించిన విధానం, సర్వే సందర్భంగా వెలుగు చూసిన సమస్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు.
అనంతరం పొంగులేటి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని భూసమస్యలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 413 గ్రామాల్లో నక్షాలు లేకపోయినా పట్టించుకోలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం అనేక సంస్కరణలు, విధానాలు అమల్లోకి తెచ్చామని చెప్పారు. పైలట్ పద్ధతిన భూముల రీసర్వే విజయవంతంగా అమలైనందున ఆయా గ్రామాల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో నక్షాలు లేని మిగిలిన గ్రామాల్లో భూముల సర్వేకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ ఐదు గ్రామాలకు నక్షాలు తయారవుతున్నందున భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా భూముల క్రయవిక్రయాల సందర్భంగా జత చేయాల్సిన సర్వే మ్యాప్, ప్రతి భూమికి ఆధార్ తరహాలో ఇచ్చే భూధార్ నెంబర్‌ను కేటాయించే ప్రక్రియను కూడా అమలు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. ఈ ఐదు గ్రామాల్లో ఐదు గుంటలకు పైగా ఉండి రికార్డుల్లో లేని భూములకు కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలని, ఆయా గ్రామాల్లోని రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలను కూడా రికార్డుల్లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
భూములు విలువల సవరణపై కీలక భేటీ
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించే ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆ శాఖ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలను ఎప్పటి నుంచి సవరించాలి, ఎలా సవరించాలన్న దానిపై చర్చించారు. వ్యవసాయ భూములకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా విలువల సవరణ ప్రతిపాదనలను మంత్రి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఔటర్ రింగురోడ్డు లోపలి భాగంలో ఉన్న 38 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విలువల సవరణలను అమలు చేసే విషయంపై సమాలోచనలు జరిపారు. త్వరలోనే మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.