వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్‌’! | Summer Sports Coaching Fee Hike in Hyderabad | Sakshi
Sakshi News home page

వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్‌’!

May 1 2026 12:03 AM | Updated on May 1 2026 12:03 AM

Summer Sports Coaching Fee Hike in Hyderabad

‘క్యూర్‌’లోని మూడు కార్పొరేషన్లలో భారీగా స్పోర్ట్స్‌ యూజర్‌ ఫీజుల వడ్డన

రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెరిగిన ప్లేగ్రౌండ్ల ఫీజు

వివిధ క్రీడలకు రూ. 50గా ఉన్న ఫీజు రూ. 200కు పెంపు

విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1,000గా ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో స్విమ్మింగ్, బాస్కెట్‌ బాల్‌ లాంటి క్రీడలు నేర్చుకోవడానికి హైదరాబాద్‌లో సమ్మర్‌ క్యాంపుల బాటపట్టే విద్యార్థులపై జీహెచ్‌ఎంసీ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొ రేషన్లు చార్జీల భారం మోపాయి. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలోని స్టేడియాలు, ప్లేగ్రౌండ్లలో సమ్మర్‌ కోచింగ్‌లకు యూజర్‌ ఫీజులు పెంచాయి. గతంలో బేస్‌బాల్, బాక్సింగ్, బాల్‌ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్‌ వంటివి ఆడుకోవడానికి రూ. 50గా ఉన్న నెలవారీ ఫీజును రూ. 200 చేశాయి. సైక్లింగ్, క్యారమ్స్, చెస్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, క్రికెట్, కిక్‌ బాక్సింగ్, తైక్వాండో, టెన్నికాయిట్‌ తదితర ఇన్‌డోర్‌/ఔట్‌డోర్‌ గేమ్స్‌పైనా ఫీజులు పెంచాయి.

క్రికెట్‌ ఫీజును రూ. 100 నుంచి రూ. 400కు పెంచగా జిమ్‌ ఫీజు రూ. 200 నుంచి రూ. 400కు, లాన్‌ టెన్నిస్‌ (క్లే) ఫీజు రూ. 450 నుంచి రూ. 1,500కు పెంచేశాయి. వాటన్నింటికీ ఏడాదికి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.100గా నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల స్టాండింగ్‌ కమిటీలు ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపాయి. అయితే సమ్మర్‌ క్యాంపుల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇచ్చాయి. 

పాఠశాల విద్యార్థులకూ భారం: పాఠశాలల విద్యార్థులు ప్లేగ్రౌండ్లు బుక్‌ చేసుకోవడంపైనా ఫీజుల భారం పెరిగింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,000కి పెరగడంతోపాటు విస్తీర్ణాన్ని బట్టి గ్రౌండ్ల ఫీజులు పెరిగాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లేగ్రౌండ్‌ను ఒక విద్యా సంవత్సరంలో 11 నెలల్లో 75 గంటలపాటు వినియోగించుకోవడానికి రూ. 10 వేలుగా ఉన్న ఫీజును మూడు రేట్లతో రూ. 15 వేలు చేశారు. అదే గ్రౌండ్‌ను 150 గంటలు వాడేందుకు రూ. 20 వేలుగా ఉన్న ఫీజును రూ. 30 వేలకు పెంచారు.

వెయ్యి చదరపు మీటర్ల గ్రౌండ్‌ను 11 నెలల్లో 150 గంటలు వాడుకోవడానికి రూ. 40 వేలుగా ఉన్న ఫీజును రూ. 60 వేలు చేశారు. మరోవైపు వ్యక్తులు లేదా కార్పొరేట్‌ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకపూట ఆయా గ్రౌండ్లను వినియోగించుకునేందుకు ప్రస్తుతమున్న రూ. 4 వేల ఫీజును రూ. 6 వేలకు, రోజు ఫీజు (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) రూ. 7,500 నుంచి రూ. 11,000కు పెంచారు. వాలీబాల్‌ కోర్టు ఒకపూట ఫీజును రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, క్రికెట్‌ నెట్‌ ఫీజును రూ. 100 నుంచి రూ. 200కు, బాస్కెట్‌బాల్‌ కోర్టు రోజు ఫీజును రూ. 7500 నుంచి రూ. 11,000కు పెంచారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement