
అబ్బురపరిచే 18వ శతాబ్దపు నిర్మాణాలు
సైదాబాద్: నిజాం రాజు సైనికాధికారి, క్రైస్తవుడైన జనరల్ మాన్షియర్ రేమండ్‌ను అప్పటి స్థానికులైన ముస్లింలు మూసారహీంగా, హిందువులు రామ్‌గా పిలిచి తమ అభిమానాన్ని చాటుకునేవారు. అందుకే ఆయన పేరుగా ఆయన నివసించిన ఆ ప్రాంతం మూసారాంబాగ్‌గా ఏర్పడింది. అంతగా ప్రజల మన్ననలు పొందిన ఆయన స్మారకార్థం నిర్మించినవే రేమండ్ స్థూపం, సమాధులు.
రెండో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ పాలనలో ఫ్రెంచ్ దేశస్తుడైన రేమండ్ సైనికాధికారిగా రాజు సైన్యంలోని ఫిరంగి సేనలను పటిష్టంగా తీర్చిదిద్దారు. 1798లో ఆయన మరణానంతరం ఆయన మృతి చిహా్నలుగా అప్పటి మలక్‌పేటలోని ఎత్తైన కొండ ప్రాంతమైన ఆస్మాన్‌ఘడ్‌లో నిర్మాణాలు చేశారు. 18వ శతాబ్దంలో యూరోపియన్ రీతిలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చూపరులను అబ్బురపరుస్తున్నాయి.
ఎత్తైన కొండపై...
ఎత్తైన కొండ ప్రాంతంపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడల్పుతో గద్దెను నిర్మించారు. ఆ గద్దెపై 23 అడుగుల ఎత్తులో రేమాండ్ స్మారక స్థూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే 28 స్తంభాలతో గ్రీకు శిల్పకళారీతిలో నిర్మించిన ఆయన సమాధి ఉంటుంది. ఆయన స్థూపానికి సమీపంలోనే వారి కుటుంబ సభ్యుల పెంపుడు జంతువులైన గుర్రం, శునకం సమాధులను సైతం నిర్మించారు. 18వ శతాబ్దపు నిర్మాణ శైలితో ఉండే ఈ కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
పురావస్తు శాఖ చొరవతో..
దశాబ్దం క్రితం వరకూ ఈ కట్టడాల ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ కొరవడి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆ తరువాత పురవాస్తుశాఖ అధికారుల చొరవతో కట్టడాల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పచ్చటి లాన్‌లతో, మెరుగైన సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఇటీవల సినిమాలు, సీరియళ్లు సైతం విరివిగా చిత్రీకరిస్తున్నారు.