స్థానిక పోరుకు ఎస్‌ఈసీ సై | State Election Commission has made all preparations for the conduct of local body elections | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుకు ఎస్‌ఈసీ సై

Sep 26 2025 1:05 AM | Updated on Sep 26 2025 1:05 AM

State Election Commission has made all preparations for the conduct of local body elections

సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం  

ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల ఖరారు ఆదేశాలు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తేదీలతో లేఖ అందిన వెంటనే షెడ్యూల్, నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు  

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాతే పంచాయతీలకు... 

నేడు సీఎం రేవంత్‌రెడ్డితో పీఆర్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, పీఆర్‌ డైరెక్టర్‌ భేటీ అయ్యే అవకాశం  

ప్రత్యేక జీవో జారీపై స్పష్టత వచ్చే అవకాశం  

సాక్షి,హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల ఖరారు ఆదేశాలు, ఎన్నికల తేదీల నిర్వహణపై లేఖ అందిన వెనువెంటనే ఎన్నికల షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ జారీకి రెడీగా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున తమకు రాజకీయంగా ఉపయోగపడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరపాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ముందుగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి, 18 నుంచి 21 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత మళ్లీ వారం, పది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది.  

నేడు సీఎంతో ఉన్నతస్థాయి అధికారుల భేటీ? 
శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్, పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్‌ డా.సృజన, ఇతర అధికారులు సమావేశం కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన ప్రత్యేక జీవోలపైనే చర్చ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. 

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం స్పష్టత తీసుకుంటారని చెబుతున్నారు. శుక్రవారమే అటు బీసీ సంక్షేమశాఖ లేదా ప్రణాళిక శాఖ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక జీవోలు విడుదల అయ్యే అవకాశం ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.  

జీఓలు జారీ కాగానే... 
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోతోపాటు, ఎన్నికల తేదీని తెలియజేస్తూ ప్రభుత్వం అధికారిక లేఖ అందజేసిన వెంటనే కార్యరంగంలోకి దూకేలా ఎస్‌ఈసీ సన్నాహాలు పూర్తి చేసినట్టు సమాచారం. సర్కార్‌ నుంచి సమాచారం అందిన వెంటనే ఎన్నికలు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పీఆర్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి చీఫ్‌ సెక్రటరీ కూడా హాజరై, ఆయా శాఖల వారీగా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నట్టు తెలుస్తోంది.  

గతంలో 3 దశలు... ఇప్పుడు 2 దశల్లోనా?
గతంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు మూడు దశల్లో జరగగా...ఈసారి రెండు విడతల్లోనే పూర్తిచేసే ఆలోచనతో ఎస్‌ఈసీ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టుగా ఎస్‌ఈసీ వర్గాలు వెల్లడించాయి. బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేసుకొని, ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, ఎన్నికల మెటీరియల్‌ ప్రింట్‌ చేసి, మార్గదర్శకాలు, ఇతర పుస్తకాల ముద్రణ, తదితరాల తయారీ, గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు తమ వెబ్‌సైట్‌లోని టీ–పోల్‌లో సిద్ధం చేసి పెట్టారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎస్‌ఈసీకి ఉత్తర్వులు అందగానే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కానుంది. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలు మినహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మిగతా సమస్యలేవీ లేనందున ఎస్‌ఈసీ సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement