బీఆర్‌ఎస్, బీజేపీ మిలాఖత్‌ | Spiritual corridor from Basara to Bhadrachalam | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్, బీజేపీ మిలాఖత్‌

Jun 14 2026 5:03 AM | Updated on Jun 14 2026 5:03 AM

Spiritual corridor from Basara to Bhadrachalam

హరీశ్‌రావు లేఖ రాస్తే కిషన్‌రెడ్డి స్పందిస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి 

సింగరేణికి నష్టం చేసింది బీఆర్‌ఎస్‌ సర్కారే 

ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల కోసంసంస్థ రూ.వేల కోట్లు కోల్పోయింది 

బాసర టు భద్రాచలం దాకా ఆధ్యాత్మిక కారిడార్‌ 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత బీఆర్‌ఎస్‌ నాయకత్వం, బీజేపీ కలిసి సింగరేణికి నష్టం చేసి, ఇప్పుడు ఇద్దరూ మిలాఖత్‌ అయి దొంగే దొంగ అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దోపిడీదారులు, కుట్రలు చేసే వారి నుంచి సింగరేణి ఆస్తులు, వనరులను కాపాడతామని చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లాలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలసి ఆయన దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు 335 మందికి సింగరేణి కారుణ్య నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. 

హరీశ్‌రావు పదేళ్లు మంత్రిగా పని చేసి రోజుకో అబద్ధం చెబుతూ అబద్ధాల రావుగా మారారని భట్టి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సింగరేణికి ఏం చేశారని ప్రశ్నించారు. సంస్థపై కుట్రపూరితంగా హరీశ్‌రావు లేఖ రాస్తే, కిషన్‌రెడ్డి స్పందిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల కోసం రెండు బ్లాక్‌లను సంస్థకు రాకుండా చేశారని ఆరోపించారు. 

కోయగూడెం బ్లాక్‌ వేలంలో పాల్గొనకపోవడంతో రూ.29,106 కోట్ల విలువైన 67 మిలియన్‌ టన్నుల బొగ్గును సంస్థ కోల్పోయిందన్నారు. దీంతో సంస్థకు వచ్చే రూ.19,360 కోట్ల లాభం చేజారిపోయిందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లు మైనింగ్‌ చేసే సత్తుపల్లి బ్లాక్‌ 3లో 32 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉండగా, వేలంలో పాల్గొనక రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.2,624 కోట్ల నికర లాభాన్ని సింగరేణి నష్టపోయిందన్నారు. సింగరేణి. ‘మారుపేర్ల’సమస్యపై ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.  

గోదారి పుష్కరాలు, ఆలయాలకు రూ.3 వేల కోట్లు  
పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 37 రోజుల్లోనే నిధుల మంజూరు చేసి గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి రూ.70 కోట్లతో పనులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లు మంజూరు చేశామన్నారు. గోదావరి పుష్కరాల కోసం అవసరమైన వసతులు, ఘాట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ఆలయాల అభివృద్ధికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలను రూ.802 కోట్లతో సుందరీకరించి, ఆధ్యాత్మిక కారిడార్‌గా వృద్ధి చేస్తామన్నారు. 

ఈ పర్యటనలో గూడెం గుట్ట ఆలయ అభివృద్ధికి రూ.70కోట్లు, మినీ ఎత్తిపోతల పథకానికి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ వార్డుల ఆఫీసులకు రూ.1.40కోట్లు, విశ్వనాథ ఆలయం అభివృద్ధికి రూ.3 కోట్లతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కె.ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, రాజ్‌ ఠాకూర్, గండ్ర సత్యనారాయణరావు, రామ్‌దాస్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement