చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు | Speakers at roundtable meeting fires on Chandrababu, Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు

May 28 2026 6:12 AM | Updated on May 28 2026 6:12 AM

Speakers at roundtable meeting fires on Chandrababu, Pawan Kalyan

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

హెరిటేజ్‌ను బ్యాన్‌ చేద్దాం 

ప్రొ.నాగేశ్వర్‌పై కేసులు విత్‌డ్రా చేసుకోవాలి 

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

పంజగుట్ట (హైదరాబాద్‌): ఏపీలో ప్రొ.నాగేశ్వర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని వక్తలు డిమాండ్‌ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతిదళ్‌ ఆధ్వర్యంలో క్రాంతిదళ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పృథ్విరాజ్‌ యాదవ్‌ అధ్యక్షతన ‘తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తనపై పెట్టిన కేసులు చూస్తే నవ్వొస్తుందన్నారు. ‘నేను కుల చిచ్చుపెట్టానట.. ప్రాంతం గురించి మాట్లాడానట.. అల్లర్లు సృష్టించేందుకు పనిచేశానట.. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశానట.. ఆ కేసులు చూస్తుంటే నవ్వొస్తుంది’ అని అన్నారు. తెలంగాణ వారు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం రైల్వేజోన్‌ ఇచ్చినట్లే ఇచ్చి ఆదాయం వచ్చే మరో లైన్‌ను ఒడిశాకు కలిపారని, మచిలీపట్నం ఆయిల్‌ గ్యాస్‌ నిక్షేపాలను దుర్మార్గమైన వేదాంత కంపెనీకి అప్పచెప్పారన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని, తాను ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని చెప్పారు. 

మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్‌... 
‘పవన్‌ కళ్యాణ్‌కు ప్రజాస్వామ్యం, తెలంగాణ కోసం మాట్లాడే హక్కే లేదు. అసలు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే హక్కు కూడా లేదు. పూటకో రంగుమార్చేవాడు, చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్‌ను మోసం చేసిన వాడు పవన్‌. ఎన్‌టీఆర్‌ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. పవన్, బాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వరాదు’ అని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ‘చంద్రబాబు, పవన్‌ జాగ్రత్త. రజాకార్లనే ఉరికించిన నేల ఇది. మీ ఆస్తులు, ఆధార్‌ కార్డులు ఇక్కడే ఉన్నాయి. మీ ఆస్తులు తగలబెట్టడం కాదు, అస్తిత్వం లేకుండా చేస్తాం. చంద్రబాబు హెరిటేజ్‌ను నేటి నుంచి తెలంగాణలో బ్యాన్‌ చేద్దాం’ అని పృధ్వీరాజ్‌ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబును విమర్శించామని, కానీ ప్రస్తుతం వారు చేస్తున్న బూతుపురాణాల్లా ఎప్పుడూ విమర్శించలేదని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. వెంటనే నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement