
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్‌ఘడ్ రాయపూర్‌కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కేపీహెచ్‌బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్‌బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
మాదాపూర్‌లోని మెడికొవర్ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్‌లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్‌ను డెవలప్ చేశాడు. యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్‌ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.