33 రోజుల్లో ఏడుసార్లు ఒకే వ్యక్తిని కాటేసిన సర్పం
గ్రామంలో చర్చనీయాంశంగా మారిన ఘటన
గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు. పాము పగబట్టి కాటేస్తోందా..లేక ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతున్నాడా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రైవేటు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
దసరా నవరాత్రుల ఉత్సవాలకు ముందు ఉదయం 11 గంటల సమయంలో ఓ పాము పడగను తొక్కడంతో దాని కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తర్వాత నాలుగైదు రోజులకు రాత్రి 11 గంటలకు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే తన సోదరులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాముకాటు వేసింది.
మళ్లీ వెంటనే తేరుకుని ఆస్పత్రికి వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం, శనివారం, ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్ పాముకాటుకు గురవుతున్నాడు. ఇలా 33 రోజుల్లోనే ఏడుసార్లు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వినడానికి వింతగా అనిపించినా ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటేస్తుండటం సంచలనంగా మారింది. ఏదైనా సర్పదోషం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బుధ, శని, ఆదివారం వచ్చిందంటే చాలు తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లను ఎప్పుడూ అంటిపెట్టుకుంటున్నాడు. పాముకాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక బాధితుడు ఇబ్బంది పడుతుండటంతో ఆయన పరిస్థితి చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని పాము ఎందుకు కాటు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.


