ఒకే దూలానికి ఉరేసుకుని ఇద్దరి బలవన్మరణం
చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
జగిత్యాలక్రైం: నాడు భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపులతో తల్లి ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నేడు కూతురు సైతం అదే దూలానికి ఉరేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 16 ఏళ్ల క్రితం ఎండపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వెనంక రవికి ఇచ్చి వివాహం చేశారు.
వీరికి సహస్ర (16), మణికార్తీక్ సంతానం. ఈనేపథ్యంలో భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు జ్యోతిని వేధింపులకు గురిచేయడంతో 2017లో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రవి, సవిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో సహస్త్ర ఎండపల్లి మండలం కుమ్మరిపల్లి కసూ్తరిబాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెల క్రితం ఆమెకు ముక్కు ఆపరేషన్ జరిగింది. వసతి గృహంలో ముక్కు నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గతంలో తల్లి ఆత్మహత్య చేసుకున్న దూలానికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా మృతురాలి అమ్మమ్మ పొరండ్ల సుగుణ తన మనుమరాలి మృతిపై అనుమానాలున్నాయని, తండ్రి రవి, సవతి తల్లి సవిత, వెన్నంకి లక్ష్మి, వెన్నంకి శ్రీనివాస్‌లు కారణమని ఫిర్యాదు చేసింది. వేధింపులు భరించలేకనే కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతుందని, కుటుంబసభ్యులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, తల్లీకూతుళ్లు ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రి మార్చురీ గదిలో ఉంచగా, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.


