ప్రాజెక్టులకు మళ్లీ జలకళ | Projects have regained water due to heavy rains | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు మళ్లీ జలకళ

Oct 30 2025 4:31 AM | Updated on Oct 30 2025 4:31 AM

Projects have regained water due to heavy rains

సాగర్‌ 20 గేట్లు, ఎస్సారెస్పీ 16 గేట్లు, మూసీ 8 గేట్లు ఎత్తివేత

కేతేపల్లి/నాగార్జునసాగర్‌/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్‌: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.  

నాగార్జునసాగర్‌ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్‌ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్‌ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్‌ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది.  

ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. 

బాబ్లీ గేట్ల మూసివేత 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్‌ 29న మూసివేస్తారు. 

అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్‌ఈ జగదీశ్, నాందేడ్‌ ఈఈ సీఆర్‌ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement