
మద్యం మత్తులో ఓ వ్యక్తి వింత చేష్ట
తిరుపతి జిల్లా: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను కాటేసిన కట్లపామును పట్టుకుని తల కొరికేశాడు. ఆ పామును ఇంటికి తీసుకువెళ్లి తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ విచిత్ర ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో గురువారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు... చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్ (47) గ్రామంలో జాతర సందర్భంగా గురువారం రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కట్లపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ వెంటనే ఆ పామును పట్టుకుని తల కొరికేశాడు.
ఆ పామును చేతపట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి మంచంలో తన పక్కనే పెట్టుకుని నిద్రించాడు. ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచే సమయానికి వెంకటేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పక్కన చనిపోయిన పాము ఉంది. వెంటనే అతడ్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాము కాటు వేయడం వల్ల వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.