
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్‌సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్?