హైదరాబాద్ : జైల్‌భవన్‌లో ఈ రోజు (శుక్రవారం) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. జైళ్లశాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సత్కరించారు. ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ విక్రమ్ త్రివేదీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సౌమ్యా మిశ్రాకు అందజేశారు.
జైళ్ల శాఖలో సౌమ్యామిశ్రా చేసిన సంస్కరణలకు గానూ ఆమెకు ఈ అవార్డు అందజేసినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. జైళ్ల ఆధునీకరణ, సంక్షమే కార్యక్రమాలు, సంస్కరణాత్మక విధానాల ప్రోత్సాహం తదితర రంగాలలో ఆమె విశిష్ట సేవలు అందించినట్లు పేర్కొన్నారు.
డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ వంశీ మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు డా. ఉలాజీ ఎలియాజర్ (కోఆర్డినేటర్), ఆకాంక్ష షా (ప్రతినిధి)తో పాటు ఇతరులు హాజరయ్యారు.


