
ఇష్ట దైవాన్ని స్మరించేలా పేర్లు
ప్రత్యేకత చాటుతున్న గ్రామాలు
ఆదిలాబాద్ జిల్లా: ఇలవేల్పును నిత్యం స్మరించేలా పలు గ్రామాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. సిరిచెల్మ ప్రాంతంలో మహిమ గల మల్లన్న.. కప్పర్లలో విష్ణు నారాయణుడు, కేస్లాపూర్‌లో నాగోబా నామం అధికంగా వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని కుటుంబాల్లో ఎక్కువ మందివి తమ ఆరాధ్య దైవం పేర్లే ఉండడం గమనార్హం. అలాంటి వాటిపై ఈ వారం ఓ లుక్కెద్దాం.
సిరిచెల్మలో.. మల్లన్న, మల్లేశ్‌లు
⇒ మండలంలోని సిరిచెల్మ మల్లన్న ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది. ఇలవేల్పుగా భావించే స్వామి నామంగా గ్రామంలో దాదాపు 200 మందికి పైగా పేర్లున్నాయంటే అతి శయోక్తి కాదు. మల్లన్న, మల్లేశ్, మల్లికార్జున్, మహేశ్, మహేశ్వరి, సోమన్న వంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. చుట్టు పక్క గ్రామాల్లో సైతం ఇవే అధికంగా ఉండడం గమనార్హం.
⇒ గ్రామంలో యాదవ కుటంబానికి చెందిన నేతుల మల్లేశ్ తాత ముత్తాతల పేర్లు కూడా మల్లన్న నామాలే. సంతానానికి ఇష్టదైవం నామం వచ్చేలా పేర్లు పెట్టాడు. పెద్ద కుమారుడు మల్లేశ్, రెండో కుమారుడు సోమేశ్, కూ తురు పేరు మహేశ్వరి. వీరి సంతానం పేర్లు కూడా మణిశ్వరి, మనుతేజ, మల్లేశ్ కావడం గమనార్హం.
⇒ సిరిచెల్మ ఆలయ పూజారుల పేర్లు సైతం పెద్ద మల్లేశ్, చిన్నమల్లేశ్,మహేశ్ కావడం ప్రత్యేకం.
కేస్లాపూర్‌లో.. నాథ్‌లు
⇒ ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు ఎక్కువ. వీరు తమ ఆరాధ్య దైవం నాగోబా వచ్చేలా సంతానానికి నామకరణం చే స్తున్నారు.ఆ పేర్ల చివరన నాథ్‌ను చేరుస్తున్నారు.
⇒ ఇక్కడ మాజీ సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్ కాగా తన తనయుడి పేరు దేవ్‌నాథ్.
⇒ ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్ తన ఇద్దరు కుమారుల పేర్లు భద్రినాథ్, మంజునాథ్.
⇒ మారు పటేల్ కుమారుల పేర్లు షేక్‌నాథ్, నాగ్‌నాథ్.
⇒ వాల్గొండకు చెందిన కొట్నాక్ యశ్వంత్‌రావ్ ఇల దైవమైన జంగో.. లింగో పేర్లను కూతు రు,కుమారుడికి పెట్టాడు.హీరాపూర్ గ్రామాని కి చెందిన కుమ్ర మాదవ్ తన ఇద్దరి కుమారు ల పేర్లు జంగో..లింగో కావడం గమనార్హం.
⇒ ఇక జైనథ్‌లో దుమాల రాములు తన ఇద్దరి కుమారుల పేర్లు పెద్ద దేవన్న, చిన్న దేవన్న.
కప్పర్లలో.. నారాయణలే అధికం
తాంసి మండలం కప్పర్లలో అధికంగా నారాయణ పేర్లే ఉన్నాయి. స్థానికంగా విష్ణు భక్తులు ఎక్కు వగా ఉండటంతో ఈ నామకరణం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు పొందిన వారు ఎక్కువగా నారాయణ నామం కలవారే. గ్రామానికి చెందిన కౌడాల నారాయణ ఎంపీపీతో పాటు జెడ్పీటీసీగానూ పనిచేశారు. ఆ తరువాత ఇద్దరు నారాయణలు సర్పంచ్‌గా కొనసాగారు. ఇక్కడ ప్రధాన పార్టీ నాయకుల పేర్లు సైతం నారాయణలే కావడం విశేషం.